Narendra Modi: క్రిప్టో కరెన్సీపై తొలిసారి బహిరంగంగా స్పందించిన మోదీ

Nations Must Ensure Crypto Not In Wrong Hands says Modi
  • అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • లేకపోతే దాని ప్రభావం యువతపై ఎక్కువగా పడుతుంది
  • మన చుట్టూ ఉన్నదాన్ని డిజిటల్ శకం మార్చేస్తోంది
క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని దేశాలు కలసికట్టుగా పని చేయాల్సి ఉందని అన్నారు. అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్తే దాని ప్రభావం యువతపై తీవ్రంగా పడుతుందని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 'ది సిడ్నీ డైలాగ్' సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు.

ఇప్పుడు మనం అత్యంత కీలక దశలో ఉన్నామని.. మన చుట్టూ ఉన్నదాన్ని ఈ డిజిటల్ శకం మార్చేస్తోందని మోదీ అన్నారు. నేటి తరంలో టెక్నాలజీ, డేటా సరికొత్త ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పారు. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలమని అన్నారు. దీన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. సరైన రెగ్యులేటరీ లేని క్రిప్టో కరెన్సీ... మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ కు ఉపయోగపడే ప్రమాదం ఉందని అన్నారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్లపై తమ ప్రభుత్వం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేస్తోందని చెప్పారు.

అంతర్జాతీయ పోటీ, అధికారాలు దేశ నాయకత్వానికి కొత్త రూపును తీసుకొస్తున్నాయని మోదీ అన్నారు. ఈ పోటీ సంపద సృష్టి, అభివృద్ధికి సరికొత్త అవకాశాలను కల్పిస్తోందని... ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ ఇండియాదని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజా సమాచార మౌలిక వ్యవస్థలను తాము నిర్మిస్తున్నామని చెప్పారు. దేశంలోని ఆరు లక్షల గ్రామాలను ఇంటర్నెట్ తో అనుసంధానించే పనిలో ఉన్నామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించే వంద కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను వేయగలిగామని చెప్పారు.
Narendra Modi
BJP
Crypto Currency

More Telugu News