Shalu Chourasiya: కేబీఆర్ పార్క్‌లో ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన నటి చౌరాసియా

Tollywood Actress Shalu Chourasiya about attack
  • ఈ నెల 14న కేబీఆర్ పార్క్‌లో నటిపై దాడి
  • చేతులు వెనక్కి విరిచిపట్టుకుని డబ్బుల కోసం డిమాండ్
  • అరవడంతో నటి ముఖంపై పిడిగుద్దులు
  • అత్యాచారానికి యత్నించడంతో ప్రతిఘటన
  • పార్క్ ఫెన్సింగ్ దూకి బయటపడిన నటి చౌరాసియా
హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్‌లో ఈ నెల 14న తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను నటి షాలు చౌరాసియా వెల్లడించారు. తాను గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం వేళ వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్‌కు వెళ్తున్నానన్నారు. అలాగే, ఈ నెల 14న కూడా వెళ్లానని, రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పార్క్ చేసిన కారు వద్దకు వస్తుండగా వెనకనుంచి వచ్చిన ఓ వ్యక్తి తనపై దాడిచేశాడని చెప్పారు.

తన రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ అరవడంతో తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని చెప్పారు. తన వద్ద నగదు లేదని, నంబరు చెబితే ఫోన్‌ పే చేస్తానని చెప్పానని, అతడు నంబరు చెప్పేందుకు తడబడడంతో తాను 100కు డయల్ చేసేందుకు ప్రయత్నించానన్నారు. గమనించిన అతడు తన ఫోన్ లాక్కుని పక్కనే ఉన్న బండరాయిపైకి తోసి తన తలను బలంగా బాదాడని, దీంతో స్పృహ కోల్పోయినట్టు చెప్పారు.

అతడు తనపై లైంగిక దాడికి యత్నించినట్టు చెప్పారు. అదే సమయంలో స్పృహ రావడంతో ప్రతిఘటించినట్టు తెలిపారు. దీంతో అతడు తనపై బండరాయి విసిరాడని, దాని నుంచి తప్పించుకున్నట్టు పేర్కొన్నారు. దుండగుడు తనను చంపి నిప్పు పెడతానని బెదిరించాడని, తను అతి కష్టం మీద పార్క్ ఫెన్సింగ్ ఎక్కి దూకి తప్పించుకున్నట్టు నటి షాలు చౌరాసియా వివరించారు.
Shalu Chourasiya
Hyderabad
KBR Park
Robbery
Tollywood

More Telugu News