ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అంటున్న రవితేజ!

17-11-2021 Wed 18:00
  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'ఖిలాడి'
  • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పైకి వెళ్లిన 'ధమాకా'
  • లైన్లో మరో రెండు సినిమాలు
Raviteja movies update
రవితేజ ఏ మాత్రం ఊపు తగ్గకుండా .. గ్యాపు లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా విడుదలకు రెడీ అవుతుండగానే రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇదెక్కడి స్పీడబ్బా అనుకునే లోగానే ఫస్టు షెడ్యూల్ అవ్వగొట్టేస్తున్నాడు .. ఫస్టు పోస్టర్ వదిలేస్తున్నాడు. ఇక ఈ మధ్య ఆయన ప్రాజెక్టులు చూస్తుంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అనే ధోరణి కనిపిస్తోంది.
 
రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడి' సినిమా చేశాడు. ఈ సినిమాలో కథానాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కనువిందు చేయనున్నారు.

ఇక రీసెంట్ గా రవితేజ ..  త్రినాథరావు నక్కినతో కలిసి 'ధమాకా' సినిమాను పట్టాలెక్కించాడు. ఇందులో ఒక కథానాయికగా శ్రీలీల కనిపించనుండగా, మరో కథానాయికకు చోటు ఉందని అంటున్నారు. ఇక ఈషా రెబ్బా ఐటమ్ సాంగ్ బోనస్. ఇలా ఇద్దరేసి ముద్దుగుమ్మలతో రవితేజ చిందులేయనున్నాడు. ఆ తరువాత సినిమాలుగా 'రావణాసుర' .. ' టైగర్ నాగేశ్వరరావు' లైన్లో ఉన్న సంగతి తెలిసిందే.