రికార్డు స్థాయి రిలీజ్ కి సిద్ధమవుతున్న 'ఆర్ఆర్ఆర్'!

17-11-2021 Wed 16:22
  • ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్'
  • జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
  • 10,000 థియేటర్లలో విడుదలకు ప్లాన్
  • అమెరికాలోనే సుమారు 2500 స్క్రీన్స్  
Rajamoulis RRR sets record in release
ఈవేళ టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా అందరి కళ్లూ 'ఆర్ఆర్ఆర్' సినిమాపైనే కేంద్రీకృతమై వున్నాయి. 'బాహుబలి' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడం అందుకు ఒక కారణం అయితే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్న అసలుసిసలు మల్టీ స్టారర్ మూవీ కావడం మరో కారణం.

ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు తిరిగే రేంజిలో జరిగి రికార్డు కొడుతోంది. మరోపక్క ఈ సినిమా విడుదల విషయంలో కూడా రికార్డు సృష్టించనుంది. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అందుకు అనుగుణంగా చిత్రం ప్రమోషన్ కార్యకలాపాలను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

ఇక రిలీజ్ విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఒకేసారి ఇన్ని థియేటర్లలో రిలీజ్ కావడం ఇదొక రికార్డని అంటున్నారు. ఒక్క అమెరికాలోనే సుమారు 2500 స్క్రీన్స్ పై ఈ 'ఆర్ఆర్ఆర్'ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కి ముందే ఇలా అన్ని రకాలుగానూ రికార్డు సృష్టిస్తున్న ఈ చిత్రం ఇక రిలీజయ్యాక ఏ స్థాయిలో రికార్డు నమోదు చేస్తుందో చూడాలి మరి!