Cricket: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్

  • మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా నియామకం
  • ప్రకటించిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే
  • కుంబ్లే స్థానంలో గంగూలీ
  • తొమ్మిదేళ్లు సేవలందించిన కుంబ్లే
Sourav Ganguly Appoints As ICC Mens Cricket Committee Chairman

బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీకి ప్రమోషన్ వచ్చింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ నియమితులయ్యారు. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మరో భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకమయ్యారు. ఇప్పటికే ఆ స్థానం నుంచి కుంబ్లే తప్పుకొన్నారు.

మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీకి స్వాగతమంటూ ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే అన్నారు. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. గత 9 ఏళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లలో పకడ్బందీగా డీఆర్ఎస్ అమలు, అనుమానిత బౌలింగ్ యాక్షన్ ను గుర్తించేందుకు అధునాతన ప్రక్రియలకు అనిల్ కుంబ్లే శ్రీకారం చుట్టారని కొనియాడారు.

అంతేగాకుండా మహిళా క్రికెట్ లోనూ ఫస్ట్ క్లాస్ స్టేటస్, లిస్ట్ ఏ క్లాసిఫికేషన్ కు ఐసీసీ ఆమోదం తెలిపింది. మహిళా క్రికెట్ కు సంబంధించి కూడా ఐసీసీ విమెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ కమిటీకి వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ ను చైర్మన్ గా నియమించింది.

More Telugu News