China: ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంపన్న దేశం అమెరికా కాదు... చైనా!

  • మెకిన్సే అండ్ కో ఆసక్తికర అధ్యయనం
  • 2000 నుంచి 2020 వరకు ఆదాయ వ్యయాల పరిశీలన
  • 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగిన ప్రపంచ సంపద
  • మూడింట ఒక వంతు ఆదాయంతో నెంబర్ వన్ గా చైనా
China emerges world richest country

కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య రంగంలో దూసుకెళుతున్న చైనా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాను కూడా డ్రాగన్ కంట్రీ వెనక్కి నెట్టింది. ప్రపంచ సంపద గడచిన రెండు దశాబ్దాల్లో 156 ట్రిలియన్ డాలర్ల నుంచి 514 ట్రిలియన్ డాలర్లకు పెరగ్గా,  చైనా మూడింట ఒక వంతు లాభార్జనతో అగ్రస్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో 2000 సంవత్సరం నుంచి 2020 వరకు ఆయా దేశాల సంపాదనపై ఓ అధ్యయనం చేపట్టింది. ప్రపంచంలోని సంపదలో 60 శాతానికి పైగా కలిగివున్న 10 దేశాల ఆదాయ వ్యయాలను పరిశీలించింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికా నికర సంపద విలువలో 22 శాతం పురోగతి కనిపించగా, చైనా మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. 2000లో చైనా సంపద విలువ కేవలం 7 ట్రిలియన్ డాలర్లు ఉండగా, 2020 నాటికి అది 120 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వం పొందడం, ఆర్థిక సంస్కరణలు చైనా ఆర్థిక స్థితిగతులను అమాంతం మార్చివేసినట్టు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా నికర ఆస్తుల విలువ ఈ 20 ఏళ్లలో 90 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగినా, చైనా సాధించిన ఆర్థిక పురోగతితో పోల్చితే అది తక్కువే.

కాగా, మెకిన్సే అండ్ కో మరో ఆసక్తికర అంశం కూడా వెల్లడించింది. ప్రపంచంలో 68 శాతం సంపద రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒదిగి ఉందని తెలిపింది. మిగిలిన సంపద మౌలిక సదుపాయాల రంగం, యంత్ర సామగ్రి, పరికరాల రంగం, మేధోపరమైన హక్కులు, పేటెంట్ల రూపంలో ఇమిడి ఉందని వివరించింది. ప్రపంచ నికర సంపదతో పాటు ప్రపంచ జీడీపీ కూడా విపరీతంగా పెరిగిపోయిందని, వడ్డీ రేట్లు తగ్గిన కారణంగా ఆస్తుల విలువ పెంపునకు ఊతమిచ్చే చర్యలు కూడా సంపద వృద్ధికి దోహదపడ్డాయని మెకిన్సే విశ్లేషించింది.

ఓ దశలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెరిగిన ధరలతో చాలామంది ప్రజలకు సొంతఇళ్ల కల పెనుభారమైందని, ఈ పరిణామం ఆర్థిక సంక్షోభానికి దారితీసిందని వివరించింది. 2008లో అమెరికాలో ఈ కారణంగానే రియల్ ఎస్టేట్ బూమ్ బద్దలైందని, చైనా కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన స్థితిలో నిలిచిందని పేర్కొంది. ప్రపంచ సంపద ఇలా ఒక్క రంగంలోనే పోగుపడకుండా, అనేక రూపాల్లో విస్తరిస్తే గ్లోబల్ జీడీపీ మరింత వృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదని మెకిన్సే అభిప్రాయపడింది.

More Telugu News