Narendra Modi: పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై సి-130 రవాణా విమానంలో ల్యాండైన ప్రధాని మోదీ

  • యూపీలో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభం
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • ఈ హైవే యూపీకి గర్వకారణం అని వెల్లడి
  • ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని వివరణ
PM Narendra Modi inaugurates Purvanchal Express Highway

ఉత్తరప్రదేశ్ లో కొత్తగా నిర్మితమైన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానంలో విచ్చేశారు. ఆ భారీ కార్గో విమానం సుల్తాన్ పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై  ల్యాండైంది. ఇక్కడే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే పొడవు 340 కిలోమీటర్లు. ఈ ఎక్స్ ప్రెస్ రహదారి కారణంగా లక్నో, ఘాజీపూర్ ల మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గనుంది.

ఈ రహదారిని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, పూర్వాంచల్ ప్రాంతవాసులకు ఈ ఎక్స్ ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి విషయంలో ఉత్తరప్రదేశ్ పైనా, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపైనా అందరికీ సందేహాలుండేవని, ఇప్పుడవన్నీ పటాపంచలు అయ్యాయని వెల్లడించారు.

సుల్తాన్ పూర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని విమర్శకులు ఓసారి చూడాలని మోదీ పిలుపునిచ్చారు. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే ఉత్తరప్రదేశ్ కు గర్వకారణం అని కితాబునిచ్చారు. రాష్ట్రంలోని తూర్పు భాగంలో ఆర్థిక పురోగతికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.

More Telugu News