Marriage: వెడ్డింగ్ పార్టీలో అనుకోని ఘటన.. షాక్‌తో అమాంతం లేచి నిలబడి తలలు పట్టుకున్న అతిథులు!

Grand wedding entry turns into a disaster video gone viral
  • పెళ్లి విందును మధురానుభూతిగా మిగుల్చుకోవాలనుకున్న జంట
  • బెడిసికొట్టిన ప్రయత్నం
  • క్రేన్ పైనుంచి అమాంతం కిందపడిన జంట
  • కిందనున్న టేబుల్ ధ్వంసం
ఏదైనా పనిని భిన్నంగా చేయడానికి చేసే ప్రయత్నం ఒక్కోసారి బెడిసికొడుతుంది. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొన్ని అయ్యో అనిపించేలా ఉంటే, మరికొన్ని తమాయించుకోలేనంతగా నవ్వు పుట్టిస్తాయి. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఓ కొత్త జంట వివాహానంతర పార్టీ ఏర్పాటు చేసింది. అందరిలా కాకుండా ఈ పార్టీలో తాము కొంచెం భిన్నంగా కనిపించాలనుకుంది. ఇందుకోసం వారు ఓ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. క్రేన్ బకెట్‌ను అందంగా అలంకరించారు. దానిపై వారు కూర్చోగానే క్రేన్ వారిని పది అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లింది. కింద పార్టీ కోలాహలంగా జరుగుతుండగా, పైన వారు అందరినీ చూస్తూ ముచ్చట్లాడుకుంటున్నారు.  

అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని ఘటన జరిగింది. ఏమైందో ఏమో కానీ వారు కూర్చున్న క్రేన్ బకెట్ ఒక్కసారిగా కిందికి వంగిపోయింది. అనుకోని ఈ హఠాత్ పరిణామం నుంచి వారు తేరుకునేలోపే కిందనున్న టేబుల్‌పై అమాంతం పడ్డారు. అంతెత్తునుంచి వారు పడడంతో టేబుల్ ధ్వంసమైంది.

ఇది చూసిన అతిథులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే లేచి ఎంతపని జరిగిపోయిందంటూ నెత్తిపై చేతులు వేసుకున్నారు. ఆ వెంటనే తేరుకుని వధూవరులను లేపి కూర్చోబెట్టారు. ఆ వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ జంటకు గాయాలయ్యాయా? ఆ తర్వాత ఏమైంది? పార్టీ కొనసాగిందా? అన్న వివరాలు తెలియరాలేదు. తమ పెళ్లి విందు జీవితంలో గొప్ప మధురానుభూతిగా మిగిలిపోవాలనుకున్న ఆ జంటకు ఈ ఘటన చేదు జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడనుంది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ జంట ఎవరు? అన్న వివరాలు తెలియరాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Marriage
Crane
Wedding Party
Instagram
Viral Videos

More Telugu News