Raghu Rama Krishna Raju: వివేకా ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర జరుగుతోంది: రఘురామకృష్ణరాజు

  • భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగిందని చెప్పే ప్రయత్నం
  • గుండె నొప్పితోనే వివేకా చనిపోయారన్న విజయసాయిని సీబీఐ విచారించాలి
  • తనపై హత్యాయత్నం కేసు ఎంత వరకు వచ్చిందో షాను జగన్ అడిగారా?
  • దస్తగిరి, శంకర్‌రెడ్డితో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడారో తేల్చాలి 
MP Raghurama Krishna Raju about viveka murder Case

హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. భూ తగాదాల నేపథ్యంలోనే వివేకా హత్య జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసలు కారణమేంటో సీబీఐ తేల్చాలని కోరారు.

 నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రఘురామరాజు.. వివేకానందరెడ్డిని హత్య చేసిన తీరుపై దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం చాలా తేడాగా ఉందన్నారు. భూ సెటిల్మెంట్‌లో గంగిరెడ్డికి రూ. 2 కోట్లు వస్తాయని చెప్పినప్పుడు హత్య కోసం రూ. 40 కోట్ల డీల్ కుదుర్చుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎందుకు అంతలా బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వివేకాను హత్య చేసిన వారిలో పులివెందులను అన్నీ తానే అయి చూసుకునే శంకర్‌రెడ్డి ఉన్న విషయం తెలిసి సీఎం జగన్ షాక్‌లో ఉన్నారన్నారు. బాబాయి హత్యపై సొంత పత్రికలోనే తప్పుడు కథనాలు రాసినందుకు ఆయన బాధపడుతున్నారని అన్నారు. వివేకాది గుండెపోటన్న విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.

అలాగే, జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు వివేకాను చంద్రబాబే హత్య చేయించారని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చారన్నారు. దస్తగిరి, శంకర్‌రెడ్డితో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడారో కూడా తేల్చాల్సిందేనని రఘురామ అన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోందని, మరి ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను జగన్ అడిగారా? అని ప్రశ్నించారు.

More Telugu News