IRCTC: శాకాహారులకు గుడ్‌న్యూస్.. సరికొత్తగా రైళ్లకు కూడా వెజిటేరియన్ సర్టిఫికెట్!

  • సర్టిఫికెట్ అందించనున్న సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
  • మతపరమైన గమ్యస్థానాలకు ప్రవేశించే రైళ్లకు త్వరలోనే జారీ
  • వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రావెల్‌పై మరింత విశ్వాసాన్ని పెంచేలా చర్యలు
 Vande Bharat 18 other trains to get vegetarian certification

శాకాహార పర్యాటకులకు ఇది నిజంగా శుభవార్తే. మతపరమైన గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఉద్దేశించిన 'వందేభారత్‌'తో పాటు మరో 18 రైళ్లు త్వరలోనే శాకాహార ధ్రువీకరణ పత్రాన్ని (వెజిటేరియన్ సర్టిఫికెట్) అందుకోనున్నాయి. ఫలితంగా నచ్చిన డెస్టినేషన్‌కు ఎలాంటి అనుమానం లేకుండా, కడుపు మాడ్చుకునే పనిలేకుండా ఎంచక్కా వెళ్లి రావొచ్చు.

రైళ్లకు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో కలిసి శాకాహార అనుకూల సేవలను ప్రారంభించిన సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది.

ఈ సర్టిఫికెట్ ఒక్క రైళ్లకు మాత్రమే పరిమితం కాదు. ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బడ్జెట్ హోటళ్లు, ఫుడ్ ప్లాజాలు, ట్రావెల్, టూర్ ప్యాకేజీలు, రైల్ నీర్ ప్లాంట్‌లు మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది. ‘వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రావెల్’పై మరింత నమ్మకాన్ని పెంచుతుంది. ఐఆర్‌సీటీసీ కిచెన్‌లోకి ప్రవేశించే ప్రతీది శాకాహారమేనని నిర్ధారిస్తుంది.

వేగాన్ సర్టిఫికెట్‌పై సాత్విక్ కౌన్సిల్ ఇండియా వ్యవస్థాపకుడు అభిషేక్ బిశ్వాస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. పర్యాటకుల్లో అత్యధికులు శాకాహారులేనన్నారు. తమ గమ్యస్థానాలకు వారిని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు, ఆహార సావనీర్‌లలో ధ్రువీకరించిన శాకాహారాన్ని అందించడం చాలా అవసరమన్నారు.

 శాకాహార లభ్యత కారణంగా వారి ప్రయాణం మరింత ఆకర్షణీయంగా, ఆచరణీయంగా ఉంటుందన్నారు. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి శాకాహార ధ్రువీకరణను తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బ్యూరో వెరిటాస్ నార్త్ జోన్ జనరల్ మేనేజర్ బ్రిజేష్ సింగ్ అన్నారు.

More Telugu News