S-400: ఈ క్షిపణి వ్యవస్థలు భారత్ కు అందితే చైనా, పాక్ ఆటలు సాగవు!

  • ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ ల కోసం రష్యాతో ఒప్పందం
  • 2018లో 5 బిలియన్ డాలర్లకు డీల్
  • సరఫరా ప్రారంభించిన రష్యా
  • శత్రు విమానాలు, క్షిపణులను ఆకాశంలోనే పేల్చివేయగల వ్యవస్థలు
Russia made S Four Hundred missile systems will be arrived India shortly

మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ పైకి తరచుగా రాకెట్ దాడులు జరుగుతుంటాయి. అయితే ఆ రాకెట్లను ఇజ్రాయెల్ గాల్లోనే తుత్తునియలు చేస్తుంటుంది. ఇందుకోసం అత్యాధునిక రాడార్లు, గురితప్పని ఆయుధాలను ఉపయోగిస్తుంటుంది. ఇప్పుడదే తరహాలో భారత్ కు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు అందించేందుకు రష్యా చర్యలు ప్రారంభించింది.

ఆ శత్రుభీకర ఆయుధ వ్యవస్థ పేరు ఎస్-400. ఇది ప్రధానంగా ఉపరితలం నుంచి గగనతలానికి సంధించే మిస్సైల్ వ్యవస్థ. మొత్తం ఐదు ఎస్-400 యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ 2018లో రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ల సరఫరాను రష్యా ప్రారంభించింది.

ఈ ఒప్పందం కార్యరూపం దాల్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించాడు. రష్యా నుంచి ఎస్-400లను కొనుగోలు చేస్తే భారత్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగాడు. కానీ ఈ ఆయుధ వ్యవస్థల పాటవంపై గట్టి నమ్మకంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం... ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. మరి భారత్ ఈ ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ లపై అంత నమ్మకం చూపడానికి వాటి సమర్థతే కారణం.

ఇది ప్రధానంగా హైబ్రిడ్ రాడార్ ఆధారిత వ్యవస్థ. గుర్తించడం, నామరూపాల్లేకుండా చేయడం అనే సూత్రం ప్రాతిపదికన ఎస్-400ని అభివృద్ధి చేశారు. అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించడం ఈ వ్యవస్థల ప్రత్యేకత. ఒకేసారి గాల్లోకి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, క్షిపణులు దూసుకొస్తుంటే ఈ వ్యవస్థలోని మాస్టర్ రాడార్ గుర్తిస్తుంది. ఆ టార్గెట్ల సంఖ్య ఆధారంగా ఎన్ని మిస్సైళ్లు, ఏ రేంజ్ వి ప్రయోగించాలో మిస్సైల్ సిస్టమ్స్ కు ఎలక్ట్రానిక్ పద్థతిలో సంకేతాలు పంపుతుంది.

ఈ రాడార్ శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును కూడా ఇది గుర్తించగలదు. దాంతో దీన్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎఫ్-16, ఎఫ్-22 వంటి ఆధునిక తరం యుద్ధ విమానాలు కూడా ఎస్-400 రాడార్ ను ఏమార్చలేవు.

ఈ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు రేంజ్ లు ఉంటాయి. 400 కిమీ, 250 కిమీ, 120 కిమీ, 40 రేంజిల్లో శత్రు కదలికలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఏ మిస్సైల్ ను ప్రయోగించాలో రాడార్ నిర్ణయిస్తుంది. లక్ష్యాన్ని గుర్తించిన 9 నుంచి 10 సెకన్లలోనే ఇది స్పందిస్తుంది.

అగ్రరాజ్యాల వద్ద ఉన్న బీ-1, బీ-2, ఎఫ్-15, ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-22 వంటి బాంబర్లు, ఫైటర్ జెట్లు, టోమహాక్ వంటి క్రూయిజ్ మిస్సైళ్లు కూడా ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ నుంచి తప్పించుకోలేవు. ఇక, చైనా, పాక్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు, క్షిపణులు దీని ముందు బలాదూర్! అందుకే భారత్ అంత ధీమాగా వీటిని సమకూర్చుకుంటోంది.

More Telugu News