Kerala: చీర కట్టుకుని రావాల్సిందే.. కేరళలో స్కూల్ టీచర్లపై ఆంక్షలు!

Kerala Schools Impose Dress Code For Women Teachers
  • వివాదం రాజేసిన స్కూళ్ల నిర్ణయం
  • ప్రభుత్వానికి మహిళా టీచర్ల ఫిర్యాదు
  • నచ్చిన దుస్తుల్లో వెళ్లొచ్చన్న విద్యాశాఖ మంత్రి
  • ఉత్తర్వులను జారీ చేసిన విద్యా శాఖ
కేరళలో మహిళా టీచర్లపై స్కూళ్ల యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తప్పనిసరిగా చీర కట్టుకునే రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆ నిర్ణయం కాస్తా వివాదానికి దారితీసింది. దీనిపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులపై ఇలాంటి ఆంక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆంక్షలపై ఆమె స్పందించారు.

ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని, చీరలే కట్టుకుని రావాలనడానికి స్కూళ్ల యాజమాన్యాలకు హక్కు ఏముందని, ‘అసలు మీరెవరు ఆదేశించడానికి?’ అంటూ ఆమె మండిపడ్డారు. తాను కేవలం మంత్రిని మాత్రమే కాదని, ఓ కాలేజీలో ప్రొఫెసర్ నని అన్నారు. వస్త్రధారణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని చెప్పిందన్నారు. తమకు నచ్చిన దుస్తుల్లో టీచర్లు స్కూలుకు వెళ్లొచ్చన్నారు. ఇలాంటి పాతబడిన కట్టుబాట్లను బలవంతంగా రుద్దడం ప్రగతిశీల కేరళకు మంచిది కాదన్నారు.

ఇటు రాష్ట్ర విద్యాశాఖ కూడా వస్త్రధారణపై సర్క్యులర్ ను జారీ చేసింది. టీచర్లు తమకు నచ్చిన దుస్తులను వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలూ అమల్లో లేవని పేర్కొంది. చాలా స్కూళ్లు, యాజమాన్యాలు ఆంక్షలు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, మళ్లీ ఇది జరగకుండా చూడాలని ఆదేశించింది.
Kerala
School
Teachers
Saree

More Telugu News