Harish Rao: ఆరోగ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తొలి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: హరీశ్ రావు

Harish Rao opens 100 beds ICU ward in Niloufer Hospital
  • నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన హరీశ్
  • రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను బలోపేతం చేస్తామన్న హరీశ్
  • కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ఆరోగ్యమంత్రి హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమంత్రిగా తొలి కార్యక్రమం నీలోఫర్ లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీలోఫర్ లో రూ. 33 కోట్లతో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మారేలా వైద్యులు సేవలందించాలని కోరారు.

హైదరాబాద్ నగరానికి నలువైపులా మెడికల్ టవర్లను నిర్మించేందుకు కృషి చేస్తామని హరీశ్ చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయని అన్నారు. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని... దానికోసం రూ. 133 కోట్లు కేటాయించామని చెప్పారు. కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
Harish Rao
TRS
Health Minister
Niloufer Hospital

More Telugu News