Fourth Option: ఎయిడెడ్ విద్యాసంస్థలకు నాలుగో ఆప్షన్... కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

Fourth option given by AP Govt to aided institutions
  • ఎయిడెడ్ సంస్థల విలీనంపై తీవ్ర నిరసనలు
  • మరో ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం
  • విలీనం సమ్మతిని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టీకరణ
  • ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి ఉండబోదన్న విద్యాశాఖ

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇటీవల జారీ చేసిన జీవో పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం జగన్ ప్రభుత్వం మనసు మార్చుకుంది. ఇప్పటివరకు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా నాలుగో ఆప్షన్ ఇస్తూ నిన్న కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నాలుగో ఆప్షన్ ప్రకారం... గతంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ సమ్మతిని వెనక్కి తీసుకోవచ్చు. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మెమో ఇచ్చారు.

గతంలో జారీ చేసిన జీవో ప్రకారం.... ఎయిడెడ్ విద్యాసంస్థలను వాటి ఆస్తులు, సిబ్బంది సహా ప్రభుత్వానికి అప్పగిస్తే వాటిని ప్రభుత్వ విద్యాసంస్థలుగా నిర్వహిస్తారు. ఒకవేళ ఆస్తులు ఇవ్వకుండా కేవలం సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చేట్టయితే ఆ విద్యాసంస్థలను ప్రైవేటుగా నిర్వహించుకోవచ్చు. వాటికి ప్రభుత్వం నుంచి నిధులు రావు. అలాకాకుండా, ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి సమ్మతి తెలపని విద్యాసంస్థలకు ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు నిధుల అందజేత కొనసాగిస్తారు.

పాత జీవో అనుసరించి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతంగా విలీనం చేస్తోందంటూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అనంతపురంలో ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో నిర్వహించిన ధర్నా హింసాత్మక రూపు దాల్చింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తోంది. నాలుగో ఆప్షన్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి ఎలాంటి ఒత్తిడి లేదని విద్యాశాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News