Porsche: టెస్లా అనుకుంటే పోర్షే ముందొచ్చింది... భారత మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు

Porsche introduced Taycan the electric car in India
  • విద్యుత్ వాహనాలకు క్రమంగా డిమాండ్
  • భారత మార్కెట్ పై కన్నేసిన టెస్లా
  • ఈలోపే వచ్చేసిన పోర్షే టేకాన్
  • ధర రూ.1.5 కోట్లు (ఎక్స్ షోరూం)
భారత్ వంటి పెద్ద మార్కెట్ ప్రతి విదేశీ కంపెనీని ఎంతో ఊరిస్తుంటుంది. సరైన పునాది పడితే వ్యాపార సామ్రాజ్యం ఇట్టే విస్తరించుకునే వెసులుబాటు భారత మార్కెట్ కల్పిస్తుంది. కొన్నాళ్లుగా ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా భారత్ లో రంగప్రవేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే... టెస్లా కంటే ముందే భారత్ లో ఎలక్ట్రిక్ కారు తీసుకువచ్చింది. దీనికి టేకాన్ అని నామకరణం చేసింది.

జర్మనీ దిగ్గజం పోర్షే వాహనాలు కోట్లలో ధర పలుకుతుంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కూడా అదే కోవలోకి వస్తుంది. పోర్షే టేకాన్ ఎక్స్ షోరూం ధరను రూ.1.5 కోట్లు అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది నాలుగు వేరియంట్లలో వస్తోంది. ఇందులో మూడు వేరియంట్లలో క్రాస్ టురిస్మో అనే సబ్ వేరియంట్ కూడా ఉంది.

పోర్షే టేకాన్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 456 నుంచి 484 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని వేగం కూడా చిరుతను తలపిస్తుంది. కేవలం 2.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇప్పటివరకు ప్రపంచంలో టేకాన్ కార్లు 30 వేల వరకు అమ్ముడయ్యాయి.

ఈ కారును కొనుగోలు చేస్తే చార్జింగ్ కిట్ కూడా అందిస్తారు. ఇంటివద్దే వినియోగదారులు కారును చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, డీలర్ల వద్ద కూడా చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. 2022 ఫస్ట్ క్వార్టర్ లో పోర్షే విద్యుత్ వాహనం భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
Porsche
Taycan
Electric Car
Tesla
India

More Telugu News