Revanth Reddy: సూర్యాపేట‌లో 'జై భీమ్' సినిమా త‌ర‌హా ఘ‌ట‌నపై రేవంత్ రెడ్డి మండిపాటు

  • టీఆర్ఎస్ ది నికృష్టపు పాలన
  • మానవహక్కులు ఉరికొయ్యకు వేలాడుతున్నాయి
  • నిన్న మరియమ్మ, శీలం రంగయ్యల ప్రాణాలు ఖాకీలు తోడేశారు
  • ఇప్పుడు వీరశేఖర్ పై అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు
  • కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?
revant reddy slams  kcr

సూర్యాపేట‌లో 'జై భీమ్' త‌ర‌హా ఘ‌ట‌న అంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను పోస్ట్ చేస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. సూర్య హీరోగా న‌టించిన జై భీమ్ సినిమాలో గిరిజ‌నుల‌పై త‌ప్పుడు కేసులు పెట్టి, వారిని తీవ్రంగా హింసిస్తారు.

సూర్యాపేట జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అలాగే ఉంద‌ని ప‌లు దిన‌ప‌త్రిక‌ల్లో వార్త‌ను ప్ర‌చురించారు. జైభీమ్ సినిమా తరహాలో చోరీ కేసులో ఓ గిరిజనుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిని చిత్రహింసలు పెట్టారని అందులో పేర్కొన్నారు.  

ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ అనే గిరిజన యువకుడిపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని తెలిపారు. తనకేమీ తెలియదని గిరిజ‌నుడు మొత్తుకున్నప్పటికీ, అత‌డి మాట‌లు వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించార‌ని ప‌లు దిన‌ప‌త్రిక‌ల్లో వార్త‌లు ప్ర‌చురించారు.

పోలీసుల‌ విచారణ అనంతరం ఇంటికి వెళ్లిన వీరశేఖర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, కాళ్లు ఉబ్బిపోయి, నడవలేని స్థితిలో ఉన్నాడ‌ని వివ‌రించారు. కుటుంబ సభ్యులు అత‌డిని ఆసుప‌త్రిలో చేర్పించి, అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారని తెలిపారు. ఈ విష‌యాల‌ను రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు.

'టీఆర్ఎస్ నికృష్టపు పాలనలో మానవహక్కులు ఉరికొయ్యకు వేలాడుతున్నాయి. నిన్న మరియమ్మ, శీలం రంగయ్యల ప్రాణాలు ఖాకీలు తోడేశారు. ఇదేం దారుణం అని హైకోర్టు కన్నెర్ర చేస్తున్న సమయంలోనే వీర శేఖర్ పై అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?' అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

More Telugu News