Mathew Wade: వేడ్ సంచలన ఇన్నింగ్స్.... టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

Mathew Wade sensational innings  steers Australia into World Cup final
  • సెమీస్ లో పాక్ ఓటమి
  • 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్
  • 17 బంతుల్లో 41 పరుగులు చేసిన వేడ్
  • అఫ్రిది బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సులు బాదిన వైనం
  • రాణించిన స్టొయినిస్, వార్నర్
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ తో దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో ఓవర్ మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. పాక్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 19 ఓవర్లలోనే ఛేదించారు. మాథ్యూ వేడ్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు.

ఆసీస్ విజయానికి 2 ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వేడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. హ్యాట్రిక్ సిక్సులతో పాక్ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. అటు స్టొయినిస్ (31 బంతుల్లో 40 పరుగులు) కూడా 2 ఫోర్లు, 2 సిక్సులు బాది ధాటిగా ఆడాడు. వేడ్, స్టొయినిస్ దూకుడుగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో ఆసీస్ 62 పరుగులు సాధించింది.

అంతకుముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 బంతులు చేయగా, అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. షాదాబ్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ పట్టగా, అంపైర్ అవుటిచ్చాడు. అయితే రివ్యూ కోరకుండానే వార్నర్ పెవిలియన్ చేరాడు. టెలివిజన్ రీప్లేలో బంతి బ్యాట్ కు తగల్లేదని స్పష్టమైంది.

ఇక, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా.... మిచెల్ మార్ష్ 28, స్టీవ్ స్మిత్ 5, మ్యాక్స్ వెల్ 7 పరుగులు చేశారు. ఇక, పాకిస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఫైనల్ చేరిన ఆసీస్ టైటిల్ పై కన్నేసింది. ఈ నెల 14న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియన్లు న్యూజిలాండ్ తో తలపడనున్నారు.
Mathew Wade
Australia
Pakistan
Semis
Final
T20 World Cup

More Telugu News