Harish Rao: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao counters to Kishan Reddy remarks
  • కిషన్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు
  • మెడికల్ కాలేజీల అంశంపై మాటల యుద్ధం
  • రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి
  • కిషన్ రెడ్డి మాటల్లో నిజం ఎంత? అంటూ హరీశ్ రావు ట్వీట్
తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశంపై కేంద్రం పంపిన లేఖకు రాష్ట్ర సర్కారు స్పందించడంలేదని, పైగా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. వాస్తవాలు ఇవిగో అంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.

2015 జూన్ 21న జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా ఉన్నతీకరించాలంటూ అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా గారికి తెలంగాణ సర్కారు లేఖ రాసిందని హరీశ్ రావు తెలిపారు. అయితే కేంద్రీయ ప్రాయోజిత పథకంలో భాగంగా జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా  కేంద్ర క్యాబినెట్ గుర్తించిన జాబితాలో తెలంగాణ ఆసుపత్రులు లేవని నడ్డా ప్రత్యుత్తరం ఇచ్చారని వివరించారు.

2019లో అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు కూడా ఇదే విషయమై లేఖ రాశామని హరీశ్ రావు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని కోరినట్టు పేర్కొన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ తమ లేఖలోని అంశాలను పరిశీలిస్తామని చెబుతూ లేఖ రాశారే తప్ప, ఇంతవరకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. అంతేకాదు, కేంద్రం నుంచి తమకు వచ్చిన లేఖల ప్రతులను కూడా హరీశ్ రావు ట్విట్టర్ లో పంచుకున్నారు.
Harish Rao
Kishan Reddy
Medical College
Telangana

More Telugu News