CM Jagan: దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన... సీఎం జగన్ అత్యవసర సమీక్ష

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • చెన్నైకి 30 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • కాసేపట్లో తీరం దాటే అవకాశం
  • దక్షిణ కోస్తాంధ్రకు వాన ముప్పు
CM Jagan reviews on rain alert to south coastal districts

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల కొన్ని గంటల్లో ఇది తీరాన్ని దాటనుంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితులకు మొదట మంచి ఆహారం అందించాలని, వారికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకునే ప్రజలను బాగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానివ్వొద్దని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగినన్ని ఔషధాలను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు.

"విద్యుత్ వ్యవస్థ సజావుగా నడిచేలా చూడండి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతింటే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాలపై కదలాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించండి. ముఖ్యంగా, చెరువుల నిర్వహణ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. గండ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేయండి. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది... రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఏం కావాలన్నా తక్షణమే అడగండి... అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ఫోన్ నెంబరు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఇక, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలు కేంద్రంగా మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, మంగళగిరిలో మరికొన్ని అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షలో ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొన్నారు.

More Telugu News