Salman Khurshid: హిందుత్వపై తన పుస్తకంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్... మండిపడుతున్న బీజేపీ నేతలు

BJP Leaders fires on Congress senior leader Salman Khurshid
  • అయోధ్యపై పుస్తకం రాసిన సల్మాన్ ఖుర్షీద్
  • ఇస్లామిక్ ఉగ్రవాదంతో హిందుత్వను పోల్చిన నేత
  • కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ నేతల ఆగ్రహం
  • ఖుర్షీద్ ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ (68) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అయోధ్యపై రాసిన తాజా పుస్తకం "సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషనల్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్" లో హిందుత్వపై చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. "సనాతన ధర్మం, శాస్త్రీయ హిందుత్వాలను కరుడుగట్టిన హిందూయిజం ఓ మూలకు నెట్టివేసింది. హిందూయిజంలోని మరో పార్శ్వం ఇదే. ఇది రాజకీయ హిందుత్వం. ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఐసిస్, బోకో హరామ్ ఇంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు.. దీనికి తేడా లేదనిపిస్తోంది" అంటూ సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ, సల్మాన్ ఖుర్షీద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో హిందుత్వాన్ని పోల్చారంటూ మండిపడ్డారు. "ముస్లిం ఓట్లు సంపాదించడానికి కాషాయ ఉగ్రవాదం అనే భావనను తెరపైకి తెచ్చిన పార్టీకి చెందినవాడే సల్మాన్ ఖుర్షీద్. అతడి నుంచి ఇంతకుమించి ఇంకేం వ్యాఖ్యలను ఆశించగలం" అంటూ విమర్శించారు.

బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ, ఈ పుస్తకం దేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తోందని అన్నారు. "హిందూయిజాన్ని ఐసిస్, బోకో హరామ్ లతో పోల్చుతారా? భారత్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఎందుకు చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా సాలెగూడు అల్లుతోంది. ఇదంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తెలిసే జరుగుతోంది. హిందూ టెర్రరిజం అనే పదం కాంగ్రెస్ కార్యాలయంలోనే పుట్టింది" అని భాటియా వ్యాఖ్యానించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్ ను కాంగ్రెస్ పార్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
Salman Khurshid
Hindutva
Book
Ayodhya
BJP
Congress
India

More Telugu News