James Neesham: కివీస్ ఆటగాళ్లంతా సంబరాలు చేసుకుంటుంటే... మౌనంగా ఉండిపోయిన జేమ్స్ నీషామ్!

  • నిన్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య సెమీస్
  • 5 వికెట్ల తేడాతో నెగ్గిన కివీస్
  • ఎలాంటి భావాలు లేకుండా ఉన్న నీషామ్
  • నీషామ్ లో కదలికే లేదన్న క్రికిన్ఫో
James Neesham explains why he silence after semifinal clash

నిన్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ముగింపు సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో కివీస్ ఆటగాళ్లు తమ డగౌట్ లో సంబరాలు చేసుకుంటుంటే, ఒక్క ఆటగాడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అతడు... కివీస్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్. సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయంలో డారిల్ మిచెల్, డెవాన్ కాన్వేలతో పాటు జేమ్స్ నీషామ్ కూడా ముఖ్యభూమిక పోషించాడు.

కివీస్ జట్టు ఓటమి కోరల్లోకి జారిపోతున్న తరుణంలో నీషామ్ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సుల సాయంతో 27 పరుగులు చేశాడు. నీషామ్ మెరుపు ఇన్నింగ్స్ తో కివీస్ గెలుపుబాటలో నిలిచింది. డారిల్ మిచెల్ ఫోర్ కొట్టడంతో న్యూజిలాండ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారిగా పైకిలేచి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. కానీ నీషామ్ లో ఎలాంటి చలనం కనిపించలేదు.

దీనిపై ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ క్రికిన్ఫో ప్రత్యేకంగా ప్రస్తావించింది. జట్టు గెలిచినా నీషామ్ లో కదలికే లేదు అని పేర్కొంది. క్రికిన్ఫో ట్వీట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. దాంతో నీషామ్ స్పందించాడు. తాను ఎందుకు మౌనంగా ఉన్నానో ఒక్క మాటలో తేల్చేశాడు. "కథ అప్పుడే ముగిసిందా? ఇంకా ఉంది!" అంటూ ఫైనల్లో గెలుపే తన లక్ష్యం అని చెప్పకనే చెప్పాడు.

2019లో ఇదే ఇంగ్లండ్ జట్టుపై న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది. త్రుటిలో వరల్డ్ కప్ ను చేజార్చుకోవడంతో కివీస్ ఆటగాళ్లకు, వారి అభిమానులకు గుండె పగిలినంత పనైంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ కొట్టాల్సిందేనని నీషామ్ భావిస్తున్నాడు. అందుకే సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత సంబరాలు చేసుకోలేదని అర్థమవుతోంది.

More Telugu News