gangula: రైతుల జీవితాలతో ఆడుకోవ‌ద్దు: మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

  • ధాన్యం కొనుగోళ్లు కేంద్ర స‌ర్కారే జర‌పాలి
  • అస‌త్యాలు ప్ర‌చారం చేస్తూ బీజేపీ నేత‌లు బతుకుతున్నారు
  • వారి మాట‌ల‌ను రాష్ట్ర  రైతులు నమ్మకూడ‌దు
  • యాసంగి పంట మొత్తం కేంద్ర స‌ర్కారే కొనాలి
gangula slams bjp

బీజేపీపై తెలంగాణ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మండిప‌డ్డారు. వ‌రి ధాన్యం కొనాలంటూ ఈ రోజు తెలంగాణ బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తోన్న నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్‌లో గంగుల మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఒక‌ వైపు ధాన్యం కొంటుంటే, మ‌రోవైపు బీజేపీ నేతలు మాత్రం ధర్నాల పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌ని చెప్పారు. రాష్ట్ర‌ బీజేపీ నేతలు ధ‌ర్నాలు చేయాల్సింది తెలంగాణ‌లో కాద‌ని, ఢిల్లీలో చేయాల‌ని ఆయ‌న అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు జర‌పాల‌ని కేంద్ర స‌ర్కారుకి చెప్పాల‌ని గంగుల క‌మ‌లాక‌ర్ డిమాండ్ చేశారు. అస‌త్యాలు ప్ర‌చారం చేస్తూ బీజేపీ నేత‌లు బతుకుతున్నారని ఆయ‌న అన్నారు. బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను రాష్ట్ర రైతులు నమ్మకూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. తాము ఇప్ప‌టికే వడ్లు కొంటున్నామని చెప్పారు. ఇక‌ బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర స‌ర్కారుదేన‌ని ఆయ‌న అన్నారు.
 
యాసంగి పంట మొత్తం కేంద్ర స‌ర్కారే కొనాలని, రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకోవ‌ద్ద‌ని గంగుల క‌మ‌లాక‌ర్  వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యం కొంటుందా? లేదా? అన్న విష‌యంపై స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. తెలంగాణ‌లో రైతులు వానాకాలం పండించిన‌ పంటలో ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

More Telugu News