Daryl Mitchell: ఫినిషర్ ను ఓపెనర్ గా మార్చితే... ఒక్క ఇన్నింగ్స్ తో హీరో అయ్యాడు!

Daryl Mitchell now emerges as New Zealand cricket hero
  • ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఘనవిజయం
  • డారిల్ మిచెల్ విధ్వంసక ఇన్నింగ్స్
  • 47 బంతుల్లో 72 నాటౌట్
  • పిడుగుల్లాంటి షాట్లతో విజృంభణ
డారిల్ మిచెల్... క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో విధ్వంసక ఆటతీరుతో న్యూజిలాండ్ ను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన మిచెల్ ఇప్పుడు హీరో అయ్యాడు. ఓపెనర్ గా బరిలో దిగిన మిచెల్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వల్పస్కోరుకే అవుటైనా, న్యూజిలాండ్ నిబ్బరంగా నిలిచిందంటే అందుకు కారణం డారిల్ మిచెలే. ఏ దశలోనూ ఇంగ్లండ్ బౌలింగ్ ను లెక్కచేయకుండా, ఎదురుదాడి చేసిన మిచెల్ ను సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్ వంటి  క్రికెట్ దిగ్గజాలు ఆకాశానికెత్తేస్తున్నారు.

నిన్నటివరకు జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా ఉన్న డారిల్ మిచెల్ ఒక్క ఇన్నింగ్స్ తో స్టార్ డమ్ అందుకున్నాడు. మిచెల్ 2019లోనే టెస్టుల్లో అరంగేట్రం చేసినా ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ అభిమానులకు అతడి గురించి తెలిసింది తక్కువే. కెరీర్ లో ఇప్పటిదాకా 5 టెస్టులు, 3 వన్డేలు, 21 అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. వాస్తవానికి డారిల్ మిచెల్ ఓపెనర్ కాదు. ఎప్పుడూ మిడిలార్డర్ లో ఆడే ఈ కుడిచేతివాటం ఆటగాడు... ఫినిషర్ గా ఏదో చివర్లో వచ్చి నాటౌట్ గా మిగిలేవాడు. అంతకుమించి అతడికి గుర్తింపులేదు.

కానీ  టీ20 వరల్డ్ కప్ లో అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఫినిషర్ కాస్తా ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఓపెనర్ గా రాణిస్తావంటూ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశం దక్కించుకున్న మిచెల్ నిన్నటి మ్యాచ్ తో తన కెరీర్ గ్రాఫ్ లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లిఖించాడు. ఓ దశలో గెలుపు ఇంగ్లండ్ వైపు మొగ్గు చూపినా, తన పవర్ హిట్టింగ్ తో  డారిల్ మిచెల్ మ్యాచ్ గతినే మార్చేశాడు.

డారిల్ మిచెల్ 1991 మే 20న న్యూజిలాండ్ లోని హామిల్టన్ లో జన్మించాడు. తండ్రి జాన్ మిచెల్ న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు మాజీ ఆటగాడు, కోచ్. తండ్రి అడుగుజాడల్లో పాఠశాల స్థాయిలో రగ్బీ ఆడిన డారిల్ మిచెల్ ఆ తర్వాత క్రికెట్ పై అనురక్తి పెంచుకున్నాడు. కివీస్ దేశవాళీ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మిచెల్ పవర్ హిట్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్న మందకొడి పిచ్ పై టైమింగ్ కుదరకపోయినా కేవలం తన భుజబలంతో బంతిని బౌండరీ దాటించడం మిచెల్ కే చెల్లింది.

ఇతర అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తక్కువ వయసులోనే లైమ్ లైట్లోకి రాగా, డారిల్ మిచెల్ 30 ఏళ్ల వయసులో అందరినీ ఔరా అనిపించాడు. మరి ఈ లేటెస్ట్ స్టార్ ను న్యూజిలాండ్ జట్టు అన్ని ఫార్మాట్లలో ఉపయోగించుకుంటుందో లేదో చూడాలి.
Daryl Mitchell
New Zealand
Cricket
England
Semis
T20 World Cup

More Telugu News