టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్!

10-11-2021 Wed 15:16
  • పేకాట కేసులో నాగశౌర్య తండ్రి అరెస్ట్
  • రిమాండ్ విధించిన కోర్టు
  • బెయిల్ పిటిషన్ వేసిన నాగశౌర్య తండ్రి ప్రసాద్ 
Actor Naga Shourya father arrest
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల పేకాట కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని ఉప్పర్ పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. గుత్తా సుమన్ అనే వ్యక్తితో కలిసి శివలింగ ప్రసాద్ పేకాటదందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు.

ఇటీవల హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు మొత్తం 30 మంది వరకు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు నిజామాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడా బాబులు ఉన్నారు. పోలీసుల దాడుల సందర్భంగా క్యాసినో చిప్స్, కరెన్సీ, స్వైపింగ్ మెషీన్లు, మద్యం తదితరాలు పట్టుబడ్డాయి.

మరోవైపు నాగశౌర్య తండ్రి ప్రసాద్ కు కోర్టు రిమాండ్ విధించింది. అయితే, వెంటనే ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు ప్రస్తుతం విచారిస్తోంది.