Cricket: టీ20 కెప్టెన్ గా నిష్క్రమణ తర్వాత తొలిసారి కోహ్లీ స్పందన

Kohli First Response After Giving Up From T20 Captaincy
  • జట్టు సభ్యులకు, మాజీ కోచ్, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు
  • అందరం కలసికట్టుగా ఉన్నామన్న కోహ్లీ
  • లక్ష్యాన్ని అందుకోలేకపోయినందుకు నిరుత్సాహపడొద్దని పిలుపు
టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తన శకాన్ని ముగించేశాడు. దీనిపై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. జట్టు సభ్యులకు, మాజీ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వాటికి కొన్ని ఫొటోలను జత చేశాడు. మైదానంలో ఒక్కడే ఉన్న ఫొటోను పెట్టి తన మనసులోని భావాలను పంచుకున్నాడు.


‘‘మన లక్ష్యాన్ని చేరుకునేందుకు మనందరం ఒక్కటిగా ఉన్నాం. దురదృష్టం కొద్దీ మనం ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. అందుకు ఏ ఒక్కరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ గా నాకు మీరందించిన సహకారం అమోఘం. దానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మళ్లీ పుంజుకునేందుకు ఒక్కటిగా కలిసి పనిచేద్దాం. లక్ష్యం వైపు అడుగులేద్దాం. జైహింద్’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఇటు మాజీ కోచ్, సహాయ సిబ్బందితో తన ప్రయాణం గురించి కూడా రాసుకొచ్చాడు. ‘‘మీతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మరపురాని జ్ఞాపకాలను మిగిల్చారు. జట్టు కోసం మీరు చేసిన కృషి అద్భుతం. భారత క్రికెట్ చరిత్రలో మీ వంతు సహకారం నిలిచిపోతుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భవిష్యత్ జీవితంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.
Cricket
Team India
Virat Kohli
Ravi Shastri
T20 World Cup

More Telugu News