Team India: కోహ్లీ నిష్క్రమణపై ఎమోషనల్ అయిన రాహుల్

  • కెప్టెన్ గా అందరికీ ఓ ఉదాహరణ అంటూ ఇన్ స్టాలో పోస్ట్
  • టీ20 వరల్డ్ కప్ వైఫల్యంపైనా స్పందన
  • ఆశించిన ఫలితం కాదంటూ ఆవేదన
KL Rahul Becomes Emotional on t20 world cup performance and kohli

టీ20లో ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి తెరపడిపోయింది. అందరూ అనుకున్నట్టే జట్టు పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించారు. టీ20 జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా కోహ్లీ జట్టుపై పెను ప్రభావమే చూపించాడు. జట్టులో ఎవరూ ఊహించని మార్పును తీసుకొచ్చాడు. చాలా మంది ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచాడు.

ఈ క్రమంలోనే కోహ్లీపై, టీ20 వరల్డ్ కప్ లో పెర్ఫార్మెన్స్ పై కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో ఇది తాము ఆశించిన ఫలితం కాదని, తప్పుల నుంచి నేర్చుకుని మళ్లీ పైకి లేస్తామని పేర్కొన్నాడు. కష్ట సమయంలో అండగా ఉన్న అభిమానులకు రుణపడి ఉంటామన్నాడు. క్రికెటర్లుగా ఎదగడంలో ఎంతో కృషి చేసిన కోచ్ లకు ధన్యవాదాలు చెప్పాడు.


అన్నింటికీ మించి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండడం గర్వకారణమన్నాడు. కెప్టెన్ గా ఎంతో చేశాడని, కెప్టెన్ అంటే ఇలా ఉండాలంటూ ఓ ఉదాహరణగా నిలిచాడని పేర్కొన్నాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ పై ఓటములతో మొదలుపెట్టిన టీమిండియా.. అనూహ్య రీతిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్ మొదలవడానికి ముందు కప్పు వేటలో ముందున్న జట్టు.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే వెనుదిరిగి రావడంపై అభిమానులంతా ఎంతో నిరాశ చెందారు. 

More Telugu News