Peddapalli District: గోదావరిఖనిలో దారుణం.. కేకలు వినిపించకుండా టీవీ సౌండ్‌ పెంచి, యువతి గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది!

Young man killed young girl for not accept his love in Telangana
  • ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
  • సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఆగ్రహం
  • కత్తితో ఇంటికెళ్లి గొంతు కోసిన ఉన్మాది
  • ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు!
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించడం లేదన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. యైటింక్లైన్ కాలనీ కేకేనగర్‌కు చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది.

తల్లి కూలిపనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉంటుండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఇదిలావుంచితే, అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. వారి కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. ఆపై ఇంట్లోని కత్తిపీటతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.

అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు నిన్న మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండడంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు.  

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.
Peddapalli District
Godavarikhani
Telangana
Love
Murder
Crime News

More Telugu News