Pakistan: పాక్‌లోని హిందువులకు అండగా ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి.. హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు

  • కారాక్ జిల్లాలో గతేడాది డిసెంబరులో హిందూ ఆలయంపై దాడి
  • ధ్వంసమైన ఆలయాన్ని నిందితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో పునర్నిర్మాణం
  • దీపావళి రోజున ఆలయం పునఃప్రారంభం
  • ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి జరుపుకున్న సీజే
  • రాజ్యాంగ పరంగా హిందువులకు అన్ని రకాల హక్కులు ఉంటాయని స్పష్టీకరణ
Chief Justic Gulzar Ahmed to visit Karak for Diwali celebrations

పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న వేళ ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందువులకు అండగా నిలిచారు. కరాక్ జిల్లా తేరి గ్రామంలోని శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ ప్రాచీన దేవాలయంపై గతేడాది డిసెంబరులో కొందరు దుండగులు దాడిచేసి ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై అప్పట్లో భారతీయ సమాజం నుంచే కాక అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పాక్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాదు, అందుకయ్యే ఖర్చును నిందితుల నుంచే వసూలు చేయాలని ఆదేశించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు.

నిర్మాణ పనులు పూర్తికావడంతో దీపావళి రోజున ఆలయాన్ని పునఃప్రారంభించారు. స్థానిక హిందువులు పెద్ద ఎత్తున హాజరై వైభవంగా వేడుక నిర్వహించారు. నాడు ఆలయ నిర్మాణానికి ఆదేశాలిచ్చిన సీజే జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆలయ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి దీపావళి పండుగ జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీల హక్కుల పరిరక్షణకు పాక్ సుప్రీంకోర్టు ఎల్లప్పుడు పాటుపడుతుందన్నారు. రాజ్యాంగ పరంగా దేశంలోని ఇతర మతాల వారికి లభించే స్వేచ్ఛ, హక్కులు హిందువులకు కూడా ఉంటాయని పేర్కొన్నారు. మతస్వేచ్ఛను సుప్రీంకోర్టు కాపాడుతుందన్న జస్టిస్ గుల్జార్ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.

More Telugu News