Devendra Fadnavis: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన దేవేంద్ర ఫడ్నవీస్

Fadnavis made allegations on Maharashtra minister Nawab Malik
  • సంచలనం సృష్టిస్తున్న క్రూయిజ్ డ్రగ్స్ కేసు
  • షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్
  • బెయిల్ పై విడుదల
  • సంచలన ఆరోపణలు చేసిన మంత్రి నవాబ్ మాలిక్
  • ఫడ్నవీస్ ఫొటో ట్వీట్ చేసిన మాలిక్
  • మండిపడిన ఫడ్నవీస్
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారంలో అనేక సంచలన ఆరోపణలు చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్... ఈ వ్యవహారంలోకి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా లాగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్ ఒకరితో ఫడ్నవీస్ కలిసి ఉన్న ఫొటోను నవాబ్ మాలిక్ ట్విట్టర్ లో విడుదల చేశారు. దాంతో ఒళ్లు మండిన ఫడ్నవీస్... దీపావళి తర్వాత నవాబ్ మాలిక్ బండారం బట్టబయలు చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నవాబ్ మాలిక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

నవాబ్ మాలిక్ కు మాఫియా గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయని, అండర్ వరల్డ్ తో ఆయన అనేక లావాదేవీలు జరిపారని వెల్లడించారు. ముంబయి పేలుళ్ల (1993) ఘటనలో దోషిగా తేలిన వ్యక్తితో నవాబ్ మాలిక్ ఆస్తి ఒప్పందం కుదుర్చుకున్నారని, కుర్లాలోని ఎల్బీఎస్ రోడ్డులో ఉన్న 2.80 ఎకరాల స్థలాన్ని అండర్ వరల్డ్ వ్యక్తుల నుంచి కేవలం రూ.30 లక్షలకే సొంతం చేసుకున్నారని వివరించారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న సర్దార్ సాహిబ్ అలీఖాన్, సలీం పటేల్ (దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కి బాడీ గార్డ్) ఈ స్థలాన్ని నవాబ్ కు కేవలం ముప్పై లక్షలకే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  

సలీం పటేల్ అనే వ్యక్తి తెలుసో లేదో నవాబ్ మాలిక్ వెల్లడించాలని, ఎల్బీఎస్ రోడ్డులోని ఆ స్థలాన్ని వారు మాలిక్ కే ఎందుకు అమ్మారో చెప్పాలని ఫడ్నవీస్ నిలదీశారు. ఉగ్రదాడులకు పాల్పడేవారితో మంత్రి లావాదేవీలు దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. మంత్రి నవాబ్ మాలిక్ చీకటి వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు సేకరించడానికి కొంచెం సమయం పట్టిందని ఫడ్నవీస్ వివరించారు.

ముంబయి తీరప్రాంతంలో ఓ క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయగా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
Devendra Fadnavis
Nawab Malik
Under World
Drugs Case
Mumbai
Maharashtra

More Telugu News