రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా.. ఆయన ముందే కొట్లాటకు దిగిన రెండు వర్గాలు!

09-11-2021 Tue 12:30
  • కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతుల సందర్భంగా కొట్లాట
  • కోమటిరెడ్డి వర్గమైన తమను పక్కన పెట్టారంటూ కొందరు నేతల అసహనం
  • మనలో మనం కొట్లాడుకోవద్దన్న రేవంత్ రెడ్డి
Congress workers fights infront of Revanth Reddy
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదు శివార్లలోని కొంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతుల కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నేతలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో జనగామ నియోజకవర్గానికి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది.

మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని.... కొత్తవారికి ఇచ్చారని వారు మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య వర్గీయులకు మాత్రమే పాసులు ఇచ్చారని... కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులమైన తమను పక్కన పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా అవతలి వర్గీయులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, రేవంత్ రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
 
మనలో మనం కొట్లాడుకుంటే చులకనైపోతామని రేవంత్ అన్నారు. అందరం కలసికట్టుగా టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ఓ తాగుబోతు నిన్న చిల్లర మాటలు మాట్లాడాడని... ఆయనకు గుణపాఠం చెప్పేలా అందరం పని చేయాలని అన్నారు. మన ఇంట్లోనే మనం గొడవపడేలా చేయవద్దని... ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. క్రమశిక్షణకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని అన్నారు. అంతర్గతంగా ఏవైనా సమస్యలు ఉంటే మండల, జిల్లా అధ్యక్షులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు.