Harekala Hajabba: నారింజ పళ్లు అమ్ముకునే ఒక సామాన్యుడు.. పద్మశ్రీ పురస్కారాన్ని ఎలా అందుకున్నాడు?

  • మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి పళ్లు అమ్ముకుంటున్న హజబ్బ
  • సొంత ఊరిలో స్కూల్ నిర్మించి పేదలకు విద్యను అందించాలనుకున్న వైనం
  • ఆయన కట్టించిన స్కూల్లో చదువుకుంటున్న 175 మంది విద్యార్థులు
  • రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అక్షర ముని
  • కాలేజీ నిర్మించాలని మోదీని కోరిన హజబ్బ
Meet The Orange Vendor Awarded A Padma Shri For Contributions In Rural Education

హరెకాల హజబ్బ... నారింజ పళ్లు అమ్ముకునే ఓ సామాన్య వ్యక్తి అయిన ఈయన ఇప్పుడు యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత నాలుగో పౌర పురస్కారమైన పద్మశ్రీని ఆయన అందుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సగౌరవంగా, నిగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు.

అసలు 66 ఏళ్ల హజబ్బ ఇంత గొప్ప పురస్కారాన్ని ఎలా అందుకోగలిగారు? ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఆయన చేసిన కృషి, సేవలు ఏమిటో తెలుసుకుందాం. నిరక్షరాస్యుడైన హజబ్బ కర్ణాటకలోని మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి నారింజ పళ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఏనాడూ పాఠశాలకు వెళ్లని ఆయన... ఏకంగా పేదల కోసం స్కూల్ నే కట్టించారు.

'ఒక రోజు ఓ విదేశీయుడు నా వద్దకు వచ్చాడు. నారింజ పళ్ల ధర ఎంతో అడిగాడు. చదువు లేకపోవడం వల్ల ఆయనతో నేను మాట్లాడలేకపోయాను. నాకు కన్నడ మాత్రమే వచ్చు. ఇంగ్లీష్, హిందీ అస్సలు రావు. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. నా సొంత ఊరిలో ఒక పాఠశాలను కట్టించి, పేదలకు విద్యను అందించాలని అనుకున్నా. అప్పటి నుంచి ప్రతిరోజు వచ్చే నా సంపాదనలో కొంత మొత్తాన్ని దీని కోసం ఆదా చేయడం ప్రారంభించాను' అని హజబ్బ తన గురించి చెప్పుకొచ్చారు.

తన స్వగ్రామంలో స్కూల్ నిర్మించాలనే హజబ్బ కల... రెండు దశాబ్దాల తర్వాత తీరింది. హరెకాల-నీపాడ్పు గ్రామంలో ఆయన పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం 175 మంది పేద విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్య కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విద్యను అందించడం కోసం ఎంతో తపన పడిన ఆయనకు స్థానికంగా ఎంతో గౌరవం ఉంది. ఆయనను అక్కడి వారు 'అక్షర ముని' అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

ఆయన ప్రారంభించిన స్కూల్ తొలుత 28 విద్యార్థులతో ప్రారంభమైంది. ఇప్పుడు 175 మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది. పదవ తరగతి వరకు ఆ పాఠశాలలో విద్యాబోధన జరుగుతోంది. వివిధ అవార్డుల ద్వారా తనకు వచ్చిన డబ్బును విద్యాలయాల నిర్మాణాలకే వినియోగిస్తానని హజబ్బ తెలిపారు. తన గ్రామంలో మరిన్ని స్కూళ్లు, కాలేజీలను నిర్మించాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఎంతో మంది వారి వంతుగా ఆర్థికసాయం చేశారని... వారి డబ్బుతో పాటు, తనకు వచ్చిన డబ్బుతో విద్యాలయాల కోసం స్థలాన్ని కొన్నానని తెలిపారు.

తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ (ఇంటర్) కాలేజీని నిర్మించాలని ప్రధాని మోదీని కోరానని హజబ్బ చెప్పారు. హజబ్బ చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. భావి తరాలకు ఇలాంటి వ్యక్తులు కచ్చితంగా ఒక రోల్ మోడల్ లా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More Telugu News