Jagati Publications: జగతి పబ్లికేషన్స్‌లో జగన్ పెట్టుబడి పైసా కూడా లేదు.. అయినా రూ. 1246 కోట్ల లబ్ధి: హైకోర్టులో సీబీఐ వాదన

  • జగతి పబ్లికేషన్‌లోకి వచ్చిన పెట్టుబడులన్నీ ముడుపులే
  • తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని జగన్  లబ్ధిపొందారు
  • విజయసాయిరెడ్డి ప్రణాళికతో జగన్ కుట్రపూరితంగా వ్యవహరించారు
  • ముడుపుల్లో హెటిరో ఎండీ శ్రీనివాసరెడ్డిది కీలక పాత్ర అన్న సీబీఐ 
  • సీబీఐ వాదనలకు బదులిస్తామన్న హెటిరో
CBI Said it Has full proofs about Jagati Publications Investments

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల కేసులో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హెటిరో సంస్థ, ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపిస్తూ జగన్ తన సంస్థ జగతి పబ్లికేషన్స్‌లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే రూ. 1246 కోట్లు పెట్టుబడిగా పొందారని, అవన్నీ ముడుపులేనని తెలిపారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

జగన్ తన సంస్థలో పెట్టుబడి కోసం అప్పటి ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం జగన్ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. హెటిరో, ఇతర కంపెనీలకు తండ్రి ద్వారా లబ్ధి చేకూర్చి, ఆపై వారిచ్చిన ముడుపును జగతిలోకి పెట్టుబడులుగా మళ్లించారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్‌కేర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు వెలుగుచూశాయని తెలిపారు. జగన్ సంస్థలో పెట్టుబడికి సంబంధించి హెటిరో ఎండీ శ్రీనివాసరెడ్డిది కీలకపాత్ర అని స్పష్టం చేశారు.

లాభాన్ని ఆశించకుండా ఎవరూ పెట్టుబడులు పెట్టరని, కానీ ఇప్పటి వరకు పైసా కూడా లాభం రాని విషయాన్ని గుర్తించాలని కోరారు. అంతేకాదు, జగతి పబ్లికేషన్స్‌లో జగన్ రూ. 73 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టి 70 శాతం వాటాను సొంతం చేసుకున్నారని, కానీ రూ. 1173 కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థలకు మాత్రం 30 శాతం వాటా మాత్రమే దక్కిందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో నేరం జరిగిందని చెప్పడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ కనుక మొదలైతే నేరాన్ని నిరూపిస్తామని సీబీఐ న్యాయవాది సురేందర్ పేర్కొన్నారు.

హెటిరో సంస్థ జగన్ జగతిలో 2006, 2007లో రెండు విడతలుగా పెట్టుబడి పెట్టిందని, అదే సమయంలో ఆ సంస్థకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని పేర్కొన్నారు. 2008లో జగతిలో మరోమారు పెట్టుబడి పెట్టిన తర్వాత మరో 25 ఎకరాలను అప్పటి ప్రభుత్వం హెటిరోకు కేటాయించిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీనివాస్‌ రెడ్డిది కీలకపాత్ర అన్నారు.

అయితే, అంతమాత్రాన హెటిరో డైరెక్టర్లందరూ నిందితులని తాము చెప్పడం లేదని పేర్కొన్నారు. సీబీఐ వాదనల అనంతరం హెటిరో తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. సీబీఐ వాదనలకు తమ వద్ద సరైన సమాధానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.

More Telugu News