ఢిల్లీ ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసు.. 24 ఏళ్ల తర్వాత తీర్పు.. అన్సల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష

09-11-2021 Tue 07:08
  • 13 జులై 1997లో బోర్డర్ సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఘటన
  • చుట్టుముట్టిన అగ్నికీలల్లో సజీవ దహనమైన 59 మంది ప్రేక్షకులు
  • నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు నిర్ధారణ
Uphaar Cinema Fire case Ansal Brothers Sentenced To 7 Years
ఢిల్లీలోని ఉపహార్ థియేటర్‌లో 24 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించగా, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 103 మంది తీవంగ్రా గాయపడ్డారు. 13 జులై 1997న ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు ప్రేక్షకులను చుట్టుముట్టాయి. తప్పించుకునే మార్గం లేని కొందరు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో తప్పించుకోగలిగారు.

సుదీర్ఘంగా నడిచిన ఈ కేసులో పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. గతంలోనే వీరికి శిక్ష పడినప్పటికీ, తాజాగా సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు గాను థియేటర్ యజమానులైన ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 2.25 కోట్ల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో దోషులుగా తేలిన కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్ చంద్ శర్మ, థియేటర్ ఉద్యోగులు పీపీ బాత్రా, అనూప్ సింగ్‌లకు చెరో ఏడేళ్లు, తలా రూ. 3 లక్షల జరిమానా విధించింది.