Team India: టీ20 వరల్డ్ కప్ ను విజయంతో ముగించిన టీమిండియా

  • నమీబియాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ
  • 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  • రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలు
  • లీగ్ దశలో మూడు విజయాలు నమోదు చేసిన కోహ్లీ సేన
Team India beat Namibia

టీ20 వరల్డ్ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. సూపర్-12 దశలో భాగంగా గ్రూప్-2లో జరిగిన మ్యాచ్ లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 133 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు సాధించగా, కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రోహిత్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కేఎల్ రాహుల్ 4 ఫోర్లు, 2 సిక్సులు సంధించాడు.

రోహిత్ శర్మ అవుట్ కావడంతో బరిలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. గ్రూప్-2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... ఆపై వరుసగా ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘనవిజయాలు నమోదు చేసింది. అయితే సమీకరణాలు సహకరించకపోవడంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా, టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్.

ఇక, టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ దశకు తెరలేచింది. నవంబరు 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబరు 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

More Telugu News