Ravi Shastri: మార్పు తేవాలనుకున్నాను... తెచ్చాను: రవిశాస్త్రి

  • టీమిండియా కోచ్ పదవికి వీడ్కోలు పలుకుతున్న శాస్త్రి
  • టీ20 వరల్డ్ కప్ తో ముగియనున్న పదవీకాలం
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • ద్రావిడ్ మార్గదర్శకత్వంలో మరింత ఎదుగుతుందని వెల్లడి
Ravi Shastri opines on his stint as Team India coash

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి ఆఖరి ఈవెంట్. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 'టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జట్టు దృక్పథంలో మార్పు తీసుకురావాలని నాకు నేనే చెప్పుకున్నాను... నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగాను' అని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో టీమిండియా ఎదిగిన తీరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు.

క్రికెట్ చరిత్రలోనే మహోన్నత జట్లలో ఒకటిగా అన్ని ఫార్మాట్లలోనూ తన ముద్ర వేసిందని వివరించారు. సొంతగడ్డమీద బలమైన జట్లుగా పేరుగాంచిన అన్ని జట్లను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వాళ్ల సొంతగడ్డల మీదే ఓడించింది అని తెలిపారు. కోహ్లీ ఎంతో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పాడని కితాబునిచ్చారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ అత్యుత్తమ రాయబారుల్లో కోహ్లీ ఒకడని కొనియాడారు. "భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడూ బెబ్బులే. కానీ ఇప్పటి జట్టు అంతకుమించిన అద్భుతాలు చేసింది" అని వివరించారు.

టీమిండియా తదుపరి కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టును మరో మెట్టు పైకి తీసుకెళతాడని భావిస్తున్నట్టు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. "జట్టుకు రాహుల్ ద్రావిడ్ రూపంలో మెరుగైన వ్యక్తి దొరికాడు... అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ కు అత్యుత్తమ జట్టు అందుబాటులో ఉంది" అని వివరించారు.

అంతేకాదు, గత కొంతకాలంగా నిర్విరామంగా బబుల్ లో ఉండడం వల్ల శక్తులు హరించుకుపోయిన భావన కలుగుతోందని, ఆటగాళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉండొచ్చని అనుకుంటున్నానని తెలిపారు. ఐపీఎల్ కు టీ20 వరల్డ్ కప్ కు మధ్య సుదీర్ఘ వ్యవధి ఉంటే బాగుండేదని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

More Telugu News