Chandrababu: తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలి: చంద్రబాబు

  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
  • అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు
  • అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించలేదంటూ ఆగ్రహం
  • ఓ అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ
Chandrababu demands stoppage of Nellore corporation elections

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడంలేదా? అని ప్రశ్నించారు.

విపక్ష నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారని తెలిపారు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, దినేశ్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More Telugu News