Punjab: పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం

Punjab govt reduce vat on Petrol and Diesel
  • పెట్రో ధరల తగ్గింపునకు చర్యలు
  • పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 వ్యాట్ తగ్గించిన పంజాబ్
  • తమకు రూ.900 కోట్ల నష్టం వస్తుందన్న పంజాబ్ మంత్రి
  • ఇప్పటికే వ్యాట్ తగ్గించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు
పెట్రో ధరలు తగ్గించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్ కూడా చేరింది. పంజాబ్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించింది. పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తాజా ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో పంజాబ్ లో చమురు ధరలు తగ్గడం ఇదే ప్రథమం అని వెల్లడించారు. అటు, పంజాబ్ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ స్పందిస్తూ, తాజాగా పన్నుల తగ్గింపు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ.900 కోట్ల మేర నష్టం వాటిల్లనుందని తెలిపారు.

ఇటీవలే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... వినియోగదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించారు. ఇతర రాష్ట్రాల్లోనూ చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయంతో ఇతర రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరిగింది.
Punjab
Vat
Petrol
Diesel
India

More Telugu News