biryani: 'బిర్యానీ దుకాణం ఎందుకు తెరిచావ్.. త‌గుల‌బెట్టేస్తా' అంటూ బెదిరింపులు.. వీడియో వైర‌ల్

  • దీపావళి పండుగ రోజున ఘ‌ట‌న‌
  • పండుగ రోజు బిర్యానీ ఎందుకు అమ్ముతున్నావంటూ బెదిరింపులు
  • వీడియో వైర‌ల్ కావ‌డంతో కేసు న‌మోదు
  • ఢిల్లీలో ఘ‌ట‌న‌
 Man Forces Biryani Shop In Delhi To Shut On Diwali

దీపావళి పండుగ రోజున బిర్యానీ దుకాణం ఎందుకు తెరిచావంటూ షాపు య‌జ‌మానిని బెదిరించాడో వ్య‌క్తి. దుకాణాన్ని త‌గుల‌బెట్టేస్తానంటూ అక్క‌డి వారిని భ‌య‌కంపితుల‌ను చేస్తూ దుర్భాష‌లాడాడు. పండుగ రోజు బిర్యానీ అమ్మ‌డం ఏంటంటూ బెదిరించాడు. కొంచెం కూడా భ‌యం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నావ్, ఏం చేస్తామో చూడు అంటూ హెచ్చ‌రిక‌లు చేశాడు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ కావ‌డంతో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలోని సంత్‌ నగర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు అయిన‌ప్ప‌టికీ నిందితుడిని పోలీసులు ఇప్ప‌టికీ గుర్తించ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌నపై దుకాణ య‌జ‌మాని నుంచి గానీ, ఇత‌రుల నుంచి గానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ, నిజానిజాలను గుర్తించి చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో నిందితుడు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దాదాపు మూడు నిమిషాల పాటు ఈ వీడియో ఉంది. ఎల్ల‌ప్పుడూ బిజీగా ఉండే వీధిలో అంద‌రూ చూస్తుండ‌గా నిందితుడు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు.

మతం పేరుతో బెదిరింపుల‌కు దిగే ప్ర‌య‌త్నం చేశాడు. జాతీయ మీడియా పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. న‌రేశ్ కుమార్ సూర్య‌వంశీ అనే వ్య‌క్తి ఈ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అత‌డు దుకాణం వ‌ద్ద‌కు వెళ్లి అందులోని సిబ్బందిని బెదిరించాడ‌ని జాతీయ మీడియా పేర్కొంది.

ఇది హిందూ ప్రాంతం అని, దీపావ‌ళి రోజు బిర్యానీలు అమ్మ‌కూడ‌ద‌ని, వెంట‌నే షాపును మూసేయాల‌ని అత‌డు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు ఆ షాపు సిబ్బంది దుకాణాన్ని మూసివేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News