Chris Gayle: రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్

  • ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం గేల్, బ్రావోలకు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
  • బ్యాట్‌ను ఎత్తి చూపి, గ్లౌజులపై సంతకం చేసి అభిమానులకు ఇచ్చేసిన గేల్
  • క్రిస్ రిటైర్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు
  • జమైకాలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందని స్పష్టం చేసిన యూనివర్సల్ బాస్
Chris Gayle confirms he didnt announce retirement

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించినట్టు వచ్చిన వార్తలపై యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ స్పందించాడు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమని, తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు డ్వేన్ బ్రావో ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యలో నిన్న చివరి మ్యాచ్ ఆడేసిన బ్రావో, క్రిస్ గేల్‌కు సహచరుల నుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ లభించింది. దీంతో గేల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

అయితే, ఈ వార్తల వెనక కారణం కూడా ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 9 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటైన అనంతరం గేల్ తన బ్యాట్‌ను ఎత్తి ప్రేక్షకుల వైపు చూపుతూ వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. విండీస్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగానే గేల్ తన గ్లౌజులపై సంతకం చేసి స్టాండ్స్‌లోని అభిమానులకు ఇచ్చేశాడు. దీంతో గేల్ రిటైర్మెంట్ వార్తలకు మరింత బలం వచ్చింది. ఈ వార్తలపై స్పందించిన గేల్.. ప్రపంచకప్ చివరి మ్యాచ్‌ను బాగా ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు. తన సొంత మైదానం జమైకాలో ఫేర్‌వెల్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశాడు.

More Telugu News