YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్యకేసు.. ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టమైన ప్రకటన

YS Vivekanandareddy murder case CBI Sensational comments on Uma shankar reddy
  • ఈ కేసులో ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయి
  • హత్య జరిగిన రోజు తెల్లవారుజామున రోడ్డుపై పరుగులు తీశారు
  • సీసీటీవీ ఫుటేజీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిర్ధారించుకున్నామన్న సీబీఐ
  • బెయిలు ఇవ్వలేమని తేల్చేసిన న్యాయస్థానం
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్టు పేర్కొంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్టు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్టు  తెలిపింది. ఈ ఫుటేజీని గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్, బెంగళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్‌కు పంపామని, అలాగే, స్వతంత్ర సాక్షులు, వ్యక్తుల సమక్షంలో ఉమాశంకర్ పరుగును రికార్డు చేశామని పేర్కొంది. రెండు పరుగులకు సారూపత్య ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్, ఫిల్మ్ ఫ్యాక్టర్ అభిప్రాయపడినట్టు సీబీఐ పేర్కొంది.

ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నిన్న కడపలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ పై విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉన్నట్టు గత నెల 27న కోర్టుకు సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. సీబీఐ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఉమాశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ను కొట్టేసింది. వివేకా హత్య కేసులో కుట్ర కోణం తేల్చేందుకు తదుపరి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
YS Vivekananda Reddy
Murder Case
Pulivendula
CBI
Gajjala Uma Shankar Reddy

More Telugu News