Andhra Pradesh: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వెనుక భారీ కుంభకోణం.. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణ

  • ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మార్చే కుట్రంటూ ఆరోపణ
  • తక్కువ ధరను వదిలేసి ఎక్కువకు ఎలా కొంటారని ప్రశ్న
  • వేల కోట్లను దారి మళ్లించే ఎత్తుగడని కామెంట్
Payyavula Keshav Comments Over SECI Deal

9 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ (సెకీ)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వెనుక ఓ పెద్ద కుంభకోణం ఉందని టీడీపీ సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సంస్థ టెండర్లను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుందని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవాళ ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.

యూనిట్ ను రూ.2కే ఇస్తామన్న సంస్థలను వదిలేసి.. రూ.2.49కి టెండర్ వేసిన కంపెనీ నుంచి ఎలా కొంటారని ప్రశ్నించారు. ఒకవేళ రాయితీలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే యూనిట్ కరెంట్ ధర రూ.3.40 నుంచి రూ.4 దాకా అవుతుందని ఆయన అన్నారు. తక్కువకు వచ్చే కరెంట్ ను వదిలేసి.. ఎక్కువ ధర పెట్టి కొనాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. వేల కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల ప్లాంట్ పెట్టేందుకు లైన్లు, భూములు సిద్ధంగా ఉన్నాయని, అలాంటప్పుడు పక్కరాష్ట్రంపై ఆధారపడడం దేనికని ఆయన ప్రశ్నించారు. ట్రాప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రజలకు నిజాలను చెప్పాలని డిమాండ్ చేశారు. ధర నిర్ణయం ఏపీఈఆర్సీదే అన్నప్పుడు.. తక్కువకు వచ్చే కరెంట్ ను వదులకుని ఎక్కువ ధర పెట్టి ఎలా కొనుగోలు చేస్తారని ఆయన నిలదీశారు.

More Telugu News