Gautham Menon: ఇది నిజంగా షాకింగ్‌గా, భ‌యంక‌రంగా ఉంది: గౌతమ్ మీనన్

  • 'అంబు సెల్వ‌న్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌
  • ఆ సినిమా గౌత‌మ్ మీన‌న్ భాగ‌స్వామి అయిన‌ట్లు ప్ర‌చారం
  • పోలీసు ఆఫీస‌ర్ గా క‌న‌ప‌డుతోన్న గౌతమ్ మీన‌న్
  • అందులో తాను న‌టించ‌లేద‌న్న ద‌ర్శ‌కుడు
Gautham Menon shocking comments

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసిన ఓ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న‌ త‌మిళ సినిమా 'అంబు సెల్వ‌న్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది. న‌టుడు విష్ణు, ద‌ర్శ‌కుడు పా రంజిత్ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో దీన్ని విడుద‌ల చేశారు. ఇందులో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ పోలీస్ అధికారిగా ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

              
దీనిపై స్పందించిన గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని, ఈ సినిమా గురించి త‌నకేం తెలియ‌ద‌ని చెప్పారు. అస‌లు ఈ పోస్ట‌ర్‌లో ఉన్న ద‌ర్శ‌కుడిని తాను ఎప్పుడూ క‌ల‌వ‌లేదని, అస‌లు అత‌డెవ‌రో కూడా తెలియ‌దని అన్నారు.

కొంద‌రు ప్ర‌ముఖుల‌తో  నిర్మాత‌లు ఈ పోస్ట‌ర్‌ను ట్వీట్ చేయిస్తున్నారని ఆయ‌న అన్నారు. త‌న‌కే తెలియ‌కుండా తాను ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ ప్ర‌చారం నిజంగా షాకింగ్‌గా, భ‌యంక‌రంగా ఉందని ట్వీట్ చేశారు. అయితే, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ చేసిన ట్వీట్‌పై చిత్ర‌ నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ స్పందిస్తూ.. గౌతం మీన‌న్‌ కూడా ఈ సినిమాలో భాగ‌మేన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మరి, ఇదేదైనా ఈ సినిమా ప్రచారం కోసం చేస్తున్న గిమ్మిక్కా? లేక నిజంగానే గౌతమ్ మీనన్ కి, చిత్ర నిర్మాతలకు మధ్య మనస్పర్థలు ఏవైనా వచ్చాయా? అన్నది త్వరలో వెల్లడవుతుంది.    

    

More Telugu News