Gorantla Butchaiah Chowdary: ఆర్థిక మంత్రి ఉద్యోగులను తీసిపారేసినట్లు మాట్లాడారు: గోరంట్ల బుచ్చ‌య్యచౌద‌రి

gorantla fires on jagan
  • జీతాలు కాస్త ఆలస్యం అయితే ఏమవుతుందని మంత్రి   అంటున్నారు
  • మరి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒకటో తేదీనే ఎందుకు?
  • ఉద్యోగులకు సకాలంలో ఎందుకివ్వరు?
ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాస్త ఆలస్యం అయితే ఏమవుతుంది? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వారిని తీసిపారేసినట్లు మాట్లాడారు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు ఠంఛనుగా ఒకటో తేదీనే ఎందుకు జీతాలు తీసుకొంటున్నారు వైఎస్ జ‌గ‌న్?' అని  గోరంట్ల బుచ్చ‌య్యచౌద‌రి ప్ర‌శ్నించారు,.
 
'మీకైతే సమయానికి జీతాలు కావాలిగానీ వాటిపైనే బతికే ఉద్యోగులకు సకాలంలో ఎందుకివ్వరు? ఏదో దాన ధర్మం చేస్తున్నట్లు బుగ్గన, సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారు. కీలక స్థానాల్లో ఉన్నవారు బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం సరికాదు' అన్నారు గోరంట్ల బుచ్చ‌య్యచౌద‌రి .

'జగన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వాకంతో ప్రపంచ బ్యాంక్‌ కూడా ఏపీకి అప్పులు ఇవ్వని పరిస్థితి వచ్చింది. పర్సంటేజీలు ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వని అవినీతిని ఈ ప్రభుత్వం పెంచి పోషించడంతో ప్రపంచ స్థాయి రుణ సంస్థలు దూరం అవుతున్నాయి. అప్పులు తేవడానికి పరిమితి నాలుగు శాతం ఉంటే ఈ ప్రభుత్వం ఏకంగా 11 శాతం మేరకు తెచ్చింది' అని ఆయన విమర్శించారు.

'రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా అప్పుల ఊబిలోకి దించిన ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదు. అప్పు పత్రాల్లో గవర్నర్‌ పేరు పెట్టడంపై బుగ్గన సమర్ధన విడ్డూరంగా ఉంది' అని గోరంట్ల బుచ్చ‌య్యచౌద‌రి విమ‌ర్శించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News