Prime Minister: కేదార్ నాథ్ పునర్నిర్మాణానికి రూ.400 కోట్లు.. రుద్రాభిషేకంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Laid Foundation To Kedarnath Re Construction Works Worth Rs 400 Crores
  • 12 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ
  • వచ్చే దశాబ్దమంతా ఉత్తరాఖండ్ దేనన్న ప్రధాని
  • ఈ పదేళ్లలో పర్యాటకులు మరింత పెరుగుతారని కామెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. కేదారనాథుడికి నిర్వహించిన రుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేదార్ నాథ్ ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేదార్ నాథ్ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ.400 కోట్లను కేటాయించారు. దానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు. కేదార్ నాథ్ లోని జగద్గురు ఆదిశంకరాచార్యుల సమాధి వద్ద 12 అడుగుల శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.


ఈ దశాబ్దమంతా ఉత్తరాఖండ్ దేనని ఆయన అన్నారు. గత వందేళ్లలో వచ్చిన పర్యాటకుల కన్నా.. రాబోయే పదేళ్లలో వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చార్ ధామ్ లకు రోడ్డు అనుసంధానం, హేమకుండ్ సాహిబ్ వద్ద భక్తుల కోసం రోప్ వే వంటి అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా ఉన్న మఠాలు, జ్యోతిర్లింగాల మధ్య అనుసంధానాన్ని కల్పించామని తెలిపారు. ఒకప్పుడు ఆధ్యాత్మికత, మతాన్ని ఓ మూస ధోరణిలో చూసేవారని, కానీ, భారత తత్వశాస్త్రం ఎప్పుడూ మానవ సంక్షేమాన్నే కోరుకుంటుందని చెప్పారు. సమాజానికి ఆ విషయాన్ని చెప్పేందుకే శంకరాచార్యులు పనిచేశారని మోదీ గుర్తు చేశారు. 2013 ప్రళయం తర్వాత కేదార్ నాథ్ పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంపై ఎన్నెన్నో సందేహాలున్నాయని, కానీ, ఎలాగైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పునర్నిర్మించాలని తాను పట్టుదలతో నిశ్చయించుకున్నానని చెప్పారు.

తరచూ కేదార్ నాథ్ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతూనే ఉన్నానని పేర్కొన్నారు. కాగా, 2019లో శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన పనులు మొదలయ్యాయి. విగ్రహం బరువు 35 టన్నులు.

Prime Minister
Narendra Modi
Uttarakhand
Kedarnath

More Telugu News