మన ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి పొజిషన్ బాగుంది: బాలకృష్ణతో మోహన్ బాబు

04-11-2021 Thu 15:14
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్
  • ఆహా ఓటీటీలో ప్రసారం
  • దీపావళి సందర్భంగా తొలి ఎపిసోడ్
  • సందడి చేసిన మోహన్ బాబు
Mohan Babu attends Balakrishna Unstoppable in Aha OTT
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో నేడు ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ లో మోహన్ బాబు సందడి చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తన అభిప్రాయాలు పంచుకున్నారు. మోహన్ బాబుతో బాలయ్య అన్ స్టాపబుల్ హైలైట్స్ ఇవిగో...

  • చిరంజీవి గురించి వ్యక్తిగతంగా ఎలాంటి దురభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. సురేఖను నా తోబుట్టువుగానే భావిస్తాను. ఆ లెక్కన చిరంజీవి మనింటి అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టే మంచి పొజిషన్ లో ఉన్నాడు. చిరంజీవితో ఎన్నో సినిమాలు చేశాను. అద్భుతమైన డ్యాన్సర్, నటుడు.
  • నా కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా 'పటాలం పాండు'. ఆ సినిమా వచ్చిన తర్వాత నా భార్య నిర్మల వారం రోజులు నాతో మాట్లాడలేదు.
  • ఓ దశలో వరుసగా నా సినిమాలు ఫెయిలయ్యాయి. దాంతో మహాబలిపురంలో నా స్థలాలు ఉంటే అమ్మేసి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశాను. నేను ఇబ్బందుల్లో ఉంటే ఎవరూ సాయం చేయలేదు.
  • చంద్రబాబు మాట విని అన్నయ్య ఎన్టీఆర్ ను వీడి బయటికి వచ్చేశా. ఆ తర్వాత రజనీకాంత్ తో కలిసి ఓసారి ఎన్టీఆర్ ను కలిస్తే ఆయనేమన్నారో తెలుసా... "మోహన్ బాబూ, నువ్వు కూడానా!" అన్నారు. ఆ మాటకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. ఇది జరిగిన కొన్నాళ్లకే నాకు క్రమశిక్షణ లేదని చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించేశాడు.
  • ఓసారి, 'అన్నయ్యా మీతో ఓ సినిమా చేస్తాను' అని ఎన్టీఆర్ ను అడిగాను. అందుకాయన... 'రాజకీయాల్లో విఫలమైనవాడ్ని, ఇప్పుడు నా సినిమాలు ఎవరూ చూడరు. నాతో నటించి డబ్బులు పోగొట్టుకోవద్దు' అని అన్నారు. అదీ ఎన్టీఆర్ గొప్పదనం!