Congress: ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఊహించని పరాభవం.. పశ్చిమ బెంగాల్‌లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ అభ్యర్థులు!

  • ఉప ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్
  • బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు
  • హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో కోలుకోలేని దెబ్బ
  • కర్ణాటక సీఎం బొమ్మ సొంత జిల్లాలో ఓటమి
  • అస్సాంలో గెలుపుతో ఊరట
Congress defeated BJP in Bypolls gandhi Party sweeps Himachal Pradesh

అప్రతిహత విజయాలతో ఇన్నాళ్లూ ఎదురులేని పార్టీగా నిలిచిన భారతీయ జనతా పార్టీకి ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. దేశంలోని మూడు లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చాలాచోట్ల ఎదురుదెబ్బలు తగిలాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాషాయ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని  ఖర్దాహా, శాంతిపూర్, గోసాబా, దిన్హటా శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్ చేసింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన బీజేపీకి ఈసారి కూడా కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న బీజేపీ ఉప ఎన్నికల్లో దానినే హైలైట్ చేసింది. అలాగే, తమ ట్రంప్ కార్డు అయిన హిందూత్వను ప్రయోగించింది. మమతను హిందూ వ్యతిరేకిగా అభివర్ణించింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ పాచిక పారలేదు. అంతేకాదు, పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింటిలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. గతంలో ఉన్న రెండు స్థానాలను కూడా కోల్పోయింది.

ఈ ఏడాది మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దిన్హాటా స్థానాన్ని స్వల్ప మెజారిటీతో చేజిక్కించుకున్న బీజేపీ ఉప ఎన్నికల్లో ఏకంగా 1.5 లక్షలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలవడం గమనార్హం. శాంతిపూర్‌లోనూ కాషాయ పార్టీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ విజయంతో టీఎంసీ విజయం సాధించిన స్థానాల సంఖ్య 215కు పెరిగింది.  

మరోవైపు, కర్ణాటకలోని హనగళ్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ మానే  7,598 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కమలనాథులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో ఘోర పరాజయం పాలైంది. మండి లోక్‌సభ స్థానంతోపాటు ఫతేపూర్ సిక్రీ, అర్కి, జుబ్బల్-కోత్‌కై అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ భార్య మండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలో నిలిచారు. ఇక్కడ బీజేపీ కార్గిల్ వార్ హీరో బ్రిగేడియర్ (రిటైర్డ్) కుశాల్‌చంద్‌ను బరిలోకి దింపినప్పటికీ విజయం ముగింట బోల్తాపడింది. వీరభద్రసింగ్ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏమైనా ఊరట లభించిందీ అంటే అది ఒక్క అసోంలో మాత్రమే. ఇక్కడ మాత్రం ఆ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఉప ఎన్నికలు జరిగిన 5 చోట్లా బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో  భవానీపూర్, తోవ్రా, మరియాని స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయగా, గోయ్‌గావ్, తమూల్‌పూర్ స్థానాల నుంచి దాని మిత్రపక్షమైన యూపీపీఎల్ బరిలోకి దిగింది. ఈ స్థానాలన్నింటినీ వారు గెలుచుకున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో కాస్తో కూస్తో లాభపడింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనే కాకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. బీజేపీ ఏడు చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకుని పై చేయి సాధించింది. వరుస పరాజయాలతో చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలను బూస్ట్‌గా చెప్పొచ్చు.

More Telugu News