Eatala Rajendar: ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నా పక్షానే నిలిచారు: ఈటల

  • హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజేత
  • 24,068 ఓట్ల తేడాతో విజయం
  • హుజూరాబాద్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఈటల
  • ఐదు అంశాలపై పోరాడుతానని వెల్లడి
Eatala on his victory

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం అనంతరం బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన ఓటమిని కోరుకుంటూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తన పక్షానే నిలిచారని వెల్లడించారు. అందుకే వారికి శిరసు వంచి వందనం చేస్తున్నానని తెలిపారు.

ఈ ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు వంటిదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ వాదులందరూ కేసీఆర్ అహంకారం పోవాలని కోరుకున్నారని, హుజూరాబాద్ లో ఎలాంటి ఫలితం వస్తుందా? అని ఆసక్తికరంగా ఎదురుచూశారని ఈటల వివరించారు. ఆఖరికి శ్మశానంలో కూడా డబ్బులు పంచారని, ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఈ గెలుపు తనలో మరింత బాధ్యతను పెంచిందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలను ఓర్చుకుని నిలిచిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఇకమీదట 5 అంశాలపై తాను పోరాడతానని ఈటల చెప్పారు. దళిత బంధు తరహాలో మిగతా కులాలకు ఆర్థికసాయం, డబుల్ బెడ్రూం ఇళ్లు, తెలంగాణ నినాదం (నీళ్లు, నిధులు, నియామకాలు), 57 ఏళ్లు నిండినవారికి వృద్ధాప్య పెన్షన్లు, రైతులకు గిట్టుబాటు ధర... అంశాలపై తన పోరాటం ఉంటుందని వివరించారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని ఎన్నటికీ వీడనని ఉద్ఘాటించారు.

More Telugu News