జగనన్న పవర్ చూశారుగా... బద్వేలులో సింగిల్ హ్యాండ్ తో అందరినీ మట్టికరిపించారు: ఎమ్మెల్యే రోజా

02-11-2021 Tue 16:27
  • బద్వేలు ఉప ఎన్నిక పూర్తి
  • విజేతగా నిలిచిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ
  • జగనన్న సుపరిపాలనకు నిదర్శనమన్న రోజా 
Roja comments after YCP won Badvel By Election
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. విజేతగా నిలిచిన డాక్టర్ సుధకు అభినందనలు తెలిపారు. బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు అంటూ ఓ వీడియో సందేశం అందించారు.

"జగనన్నపై అభిమానంతో 2019లో 45 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపిస్తే, నేడు జగనన్న పాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారు. జగనన్న సుపరిపాలనకు ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారన్న విషయం స్పష్టమైంది.

ఇవాళ చంద్రబాబునాయుడికి సూటిగా చెబుతున్నాం. కుప్పంలో నీ వాగుడు చూశాం, నీ డ్రామాలు చూశాం. ఇప్పటికైనా తెలిసిందా... ఏ సెంటర్ లో అయినా, ఏ టైమ్ లో అయినా, ఏ ఎలక్షన్ లో అయినా జగన్ మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీలను మట్టి కరిపిస్తారు.

బద్వేలులో పోటీ చేయబోమని చెప్పిన మీరు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్నందరినీ చితకబాది తరిమికొట్టారంటే జగనన్న పవరేంటో అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా... మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బద్వేలు ప్రజలు నేడు 90 వేల మెజారిటీతో సుధమ్మను ఆశీర్వదించి శాసనసభకు పంపించారు.

జగన్ గారిది ఒకే జెండా, ఒకటే అజెండా. దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా జగనన్నకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో అన్ని సీట్లు వైసీపీనే గెలవాలని, టీడీపీకి ఒకట్రెండు స్థానాలు కూడా దక్కకూడదని కోరుకుంటున్నాను" అంటూ రోజా తన వీడియోలో పేర్కొన్నారు.