Crime News: దేశం నలుమూలలా 300 బ్యాంకు ఖాతాలు.. సైబర్ దొంగలకు అద్దెకిచ్చిన వ్యక్తి అరెస్టు!

Man Rented 300 Bank Accounts Arrested
  • ఒక్కో ఖాతాకు రూ.5 వేల చొప్పున కమీషన్
  • డబ్బు పోగొట్టుకున్న మహిళ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
  • నిందితుడిని అరెస్ట్ చేస్తే విస్తుపోయే విషయాలు
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 300కు పైగా ఖాతాలు తెరిచాడు.. వాటిని జంతారాకు చెందిన సైబర్ దొంగలకు అద్దెకిచ్చుకున్నాడు. ఆ దొంగల నుంచి కమీషన్ తీసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి రామ్ పర్వేశ్ అనే 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ వెల్లడించారు.

సైబర్ దొంగలు వాడుతున్న అకౌంట్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లోని హర్దోయికి చెందిన రామ్ కు నెలకు ఒక్కో అకౌంట్ కు రూ.5 వేల చొప్పున వస్తున్నాయని చెప్పారు. సైబర్ దొంగల మోసానికి రూ.98 వేలు పోగొట్టుకున్నానని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన తమకు.. రామ్ ఇలా ఖాతాలు తెరిచి అద్దెకిస్తున్నట్టు తెలిసిందన్నారు.

ఫోన్ పే నుంచి డబ్బులు వెళ్లట్లేదని, గూగుల్ లో ఫోన్ పే కస్టమర్ కేర్ నంబర్ తీసుకుని కాల్ చేసిందని, కానీ, అవతలి వ్యక్తి ఓటీపీ వస్తుందని, ఆ నంబర్ చెప్పాలని కోరగా.. ఆమె చెప్పిందని డీసీపీ తెలిపారు. ఆ వెంటనే దుండగుడు ఆమె ఖాతా నుంచి డబ్బు కాజేశాడని చెప్పారు.

ఫిర్యాదుతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారని, తప్పించుకుపారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిపారు. నిందితుడి నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలోని చాలా మంది పేర్లను చెప్పాడని, 300కు పైగా ఖాతాలు తెరిచినట్టు వెల్లడించాడని డీసీపీ పేర్కొన్నారు.
Crime News
New Delhi
Bank Account
Cyber Crooks

More Telugu News