Cricket: టీ20 వరల్డ్ కప్.. ఈ 8 అంశాలే భారత్ కొంప ముంచాయ్!

  • పొట్టి ఫార్మాట్ కు వన్డే తరహా సెలెక్షన్
  • అదే గడ్డపై ఐపీఎల్ లో రాణించిన యువ బౌలర్లకు దక్కని అవకాశం
  • బాగా ఆడని హార్దిక్ ను అంటిపెట్టుకున్న జట్టు
  • ఓపెనర్లు రోహిత్, రాహుల్ ల వైఫల్యం
  • స్పిన్ లో తేలిపోతున్న టాపార్డర్ బ్యాటర్లు
  • బౌలింగ్ లో భారత్ కు ఆరో ఆప్షన్ కరవు
Team India Has 8 Issues to Lag Behind

ప్రత్యర్థులు చెలరేగిన చోటే టీమిండియా చతికిల పడిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి పేలవ ప్రదర్శనను కనబరిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతానికి సాంకేతికంగా టీమిండియా బరిలోనే ఉన్నప్పటికీ.. అది అసాధ్యమే. ఇంటి బాట పట్టడం దాదాపు ఖాయమైనట్టే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా సెమీ ఫైనల్ లోకి వెళ్లాలంటే మిగతా మ్యాచ్ లలో భారీ తేడాతో విజయాలు సాధించి.. నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోవాలి. నెట్ రన్ రేట్ విషయంలో గ్రూప్ 2లో ఆఫ్ఘనిస్థాన్ ప్లస్ 3తో ఉంది. మన నెట్ రన్ రేట్ మైనస్ 1.609గా ఉంది. ఈ నేపథ్యంలోనే తర్వాతి మ్యాచ్ లలో కనీసం ఒక మ్యాచ్ లోనైనా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ లు ఓడిపోవాలి. మనం ఇతర మ్యాచ్ లన్నింటిలో గెలిచినా మిగతా వాటి కన్నా మెరుగైన నెట్ రన్ రేట్ ను సాధించాలి. అలాగైతేనే మనం సెమీ ఫైనల్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఆఫ్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడమన్నది దాదాపు అసాధ్యమే అయినా.. ఎప్పుడు ఏం మ్యాజిక్ జరుగుతుందో చెప్పలేం. అందునా పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్థాన్ చాలా గట్టి పోటీనే ఇచ్చింది. ఆ జట్టుకున్న నాణ్యమైన స్పిన్ విభాగమే అందుకు కారణం. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్థాన్ ఓడించాలన్న ఒకే ఒక్క ఆశాభావమే ఇప్పుడు భారత్ కు ఉంది.

అయితే, ఈ సమీకరణాలన్నింటినీ పక్కనపెడితే.. అసలు గొప్పగొప్ప బ్యాటర్లున్న టీమిండియా అంత ఘోరమైన ప్రదర్శన ఎందుకు చేసినట్టు! కారణాలు వెతుక్కుంటే ఎన్నో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ 8 విషయాలు మన ఓటమికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

పాతకాలపు వ్యూహాలు: వేగంగా ఆడాల్సిన టీ20ల్లో సెలెక్టర్లు పాలకాలపు వ్యూహాలను అనుసరించారు. 50 ఓవర్ల (వన్డే మ్యాచ్) వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని టీమ్ ను ఎంపిక చేశారు. కేవలం అనుభవజ్ఞులకే అవకాశం ఇచ్చారు. అది మంచి ఐడియా కాదని క్రికెట్ నిపుణులు తేల్చి చెబుతున్నారు.

పొట్టి ఫార్మాట్ లో కొన్ని బంతులే ఫలితాన్ని తారుమారు చేసేస్తాయి. అలాంటి ఈ ఫార్మాట్ లో జట్టు ఎంపికలోనే అతిపెద్ద తప్పులు చేశారంటున్నారు. యూఏఈలోనే ఐపీఎల్ జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్న నిపుణులు.. ఆ పిచ్ లపై బౌలింగ్ లో చెలరేగిన హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్ వంటి వారికి ఎందుకు చాన్స్ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్ లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, పృథ్వీ షా వంటి వారికి చాన్స్ ఇవ్వాల్సిందని చెబుతున్నారు.

బాగా ఆడని వాళ్లకు అందలం: కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా ప్రదర్శన ఏమంత బాగా ఉండట్లేదు. ఆల్ రౌండర్ గా టీంలోకి తీసుకుంటున్నా గాయాల బెడదతో అడపాదడపా టీంలోకి వచ్చి వెళ్లాడు. టీంలో ఉన్నా బ్యాటింగ్ లో ఫెయిలయ్యాడు. బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి వ్యక్తిని జట్టులో కొనసాగించడంపై, అతడి మీదే ఆధారపడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక మ్యాచ్ లో బాగా ఆడనందుకే భువనేశ్వర్ పై ఎందుకు వేటు వేశారన్నది ఒక ప్రశ్నయితే.. వికెట్లు తీసేందుకు చాలా ఇబ్బంది పడిన యువ స్పిన్నర్లను ఎందుకు పక్కనపెట్టలేదన్నది ఇంకో ప్రశ్న. అనుభవానికే అంత ప్రాధాన్యాన్నిచ్చినట్టయితే అశ్విన్ ను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్నది టీమిండియా అభిమానులు, నిపుణుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. యుజ్వేంద్ర చహల్ కు అసలు అవకాశం ఎందుకు ఇవ్వలేదని అంటున్నారు.

బౌలింగ్ ఆరో ఆప్షన్ ఏదీ?: టీమిండియా వైఫల్యానికి మరో ప్రధాన కారణం బౌలింగ్ లో ఆరో ఆప్షన్ లేకపోవడం. ప్రధాన బౌలర్లు మినహా ఇండియాకు అలాంటి బౌలర్ లేడు. అయితే హార్దిక్ లేదా రవీంద్ర జడేజా మీదే టీమిండియా ఆధారపడుతోంది. వారూ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వేరే జట్లన్నీ వికెట్లు తీసే సత్తా ఉన్న ఆరేడుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంటే.. మన జట్టు మాత్రం ఆరో ఆప్షన్ కూ దూరంగానే ఉంది.

టాస్ పాత్ర కూడా వుంది: ‘క్యాచెస్ విన్ ద మ్యాచెస్’ అని క్రికెట్ పెద్దలు అంటూ ఉంటారు. కానీ, ‘టాసెస్ విన్ ద మ్యాచెస్’ అని కూడా అనాలేమో. అవును మరి.. యూఏఈ లాంటి పిచ్ లపై టాస్ ది చాలా కీలక పాత్ర. ఈ టోర్నమెంట్ మొత్తం లక్ష్యాన్ని ఛేదిస్తున్న టీంలవైపే ఫలితం వస్తోంది. కారణం.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా స్లోగా ఉంటున్న పిచ్ లు రెండో ఇన్నింగ్స్ కు వచ్చే సరికి మారిపోతున్నాయి.

అంతేగాకుండా రాత్రిపూట ఉండే తేమ కూడా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టుపై ప్రభావం చూపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే గత రెండు మ్యాచ్ లలో మనకు టాస్ విషయంలో అదృష్టం కలిసి రాలేదు. టాస్ ఓడిపోవడమూ మన ఓటిమికి కారణమైంది. అయితే, కేవలం టాస్ మీదే నెపాన్ని నెట్టడమూ మంచిది కాదు. కారణం.. నిన్న మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు.. స్కోరును కాపాడుకోగలిగింది. శ్రీలంకను చిత్తు చేయగలిగింది. ఎలా ఆడాలో ఆ జట్టు బ్యాటర్లు, బౌలర్లు చూపించారు.

స్పిన్ లో తేలిపోతున్నారు: ప్రపంచంలోనే స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కొనే నాణ్యమైన బ్యాటర్లు మన సొంతం అన్నది ఎందరో నిపుణులు చెప్పే మాట. కానీ, గత రెండు మ్యాచ్ లను చూస్తే స్పిన్ ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి మేలిమి బ్యాటర్లు లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి బౌలింగ్ లోనే వెనుదిరిగారు.

సోధికి తోడు మిషెల్ శాంట్నర్ కూడా తక్కువ పరుగులే ఇచ్చాడు. టీమిండియా బ్యాటర్లు వారి ఓవర్లలో ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇద్దరు కలిసి 8 ఓవర్లు వేసి ఇచ్చిన పరుగులు 32 మాత్రమే. ఇక, ఎలాగైనా గెలవాలన్న ఆత్రుతలో టీమిండియా బ్యాటర్లు హిట్టింగ్ వైపు మొగ్గు చూపారు. కానీ, అది ఫలించలేదు. ఈ క్రమంలోనే పంత్ తప్ప.. టాప్ బ్యాటర్లంతా బౌండరీ లైన్ల వద్ద క్యాచ్ అవుట్లుగా వెనుదిరిగారు.

టాపార్డర్ టపటపా: మ్యాచ్ లలో టాపార్డర్ కూడా సరిగ్గా రాణించట్లేదన్నది కాదనలేని సత్యం. ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు సరైన ప్రదర్శన చేయలేకపోయారు. పాకిస్థాన్ మీద కోహ్లీ ఒక్కడే ఆడాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అతడూ తేలిపోయాడు. టాపార్డర్ పడినా.. మిడిలార్డర్ ఆదుకుంటుందిలే అనుకున్నా.. ఇప్పుడు భారత మిడిలార్డరూ బలహీనంగానే ఉంది.

ఇక, న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కోహ్లీ చేసిన ప్రయోగమూ బెడిసి కొట్టింది. పాక్ తో మ్యాచ్ తర్వాత.. ఓ విలేకరి ఇషాన్ కిషన్ కు అవకాశమిస్తే ఓపెనింగ్ చేయించొచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి ‘రోహిత్ శర్మను వేరే పొజిషన్ లో దింపాలా?’ అని కోహ్లీ సురసురలాడాడు. ఆ వెంటనే రోహిత్ ను మూడో ప్లేస్ లో దింపాడు. తాను 4వ బ్యాటర్ గా వచ్చాడు. అది కూడా ఓటమికి కారణమైంది.

కోహ్లీ తప్పుకోవడం: టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని కోహ్లీ హఠాత్తుగా ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా జట్టుపై భారీ ప్రభావం చూపించి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా తప్పుకోవాలనుకుంటే వరల్డ్ కప్ తర్వాత ప్రకటించి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అలసట.. కరోనా బబుల్: ఐపీఎల్ లో ఆటగాళ్లు చాలా కాలం పాటు క్రికెట్ ఆడారు. దాదాపు నెలన్నర కరోనా బబుల్ లోనే గడిపారు. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల మానసిక, శారీరక పరిస్థితులపై ప్రభావం చూపించాయని చెబుతున్నారు. మహమ్మారి సమయంలో ఇంత టైట్ షెడ్యూల్ ను పెట్టడం మంచిది కాదని కోహ్లీ పదే పదే చెబుతూ వచ్చాడు కూడా. న్యూజిలాండ్ తో ఓటమి తర్వాత.. తమకు బ్రేక్ ఎంతో అవసరమంటూ బుమ్రా కూడా చెప్పుకొచ్చాడు. దాదాపు ఆరు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నాడు. అయితే, దానినే క్షమార్హంగా టీమిండియా ఆటగాళ్లు చెప్పుకోవడమూ మంచిది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

More Telugu News